Putin Invasion : యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. కారణం ఏంటో చెప్పిన పుతిన్
యుక్రెయిన్ పై రష్యా బలగాల దాడులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మరోసారి సమర్థించుకున్నారు. యుక్రెయిన్ పై దాడి కఠిన నిర్ణయం అని చెప్పారు.

Putin Invasion
Putin Invasion : యావత్ ప్రపంచం వద్దంటున్నా రష్యా వెనక్కి తగ్గడం లేదు. కఠినమైన ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అంటున్నారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. బాంబులు, క్షిపణులు విడుస్తూ… భీకర దాడులతో యుక్రెయిన్ ను కకావికలం చేస్తున్నాయి రష్యా సేనలు. రష్యా తీరుని యావత్ ప్రపంచం తప్పుపడుతోంది. అయినా పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు.
యుక్రెయిన్ పై రష్యా బలగాల దాడులను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం మరోసారి సమర్థించుకున్నారు. యుక్రెయిన్ పై దాడి కఠిన నిర్ణయం అని, అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. ఈ దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది, కారణం ఏంటో కూడా చెప్పారు పుతిన్. డాన్ బాస్ ప్రజల పట్ల యుక్రెయిన్ అణచివేతకు పాల్పడిందని పుతిన్ ఆరోపించారు. అందుకే తాము సైనికచర్యకు దిగాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. 2014లో సైనిక తిరుగుబాటు రాజ్యాంగ విరుద్ధమని పుతిన్ అన్నారు.
ప్రస్తుత పరిస్థితులకు యుక్రెయిన్ ప్రభుత్వ పెద్దలదే పూర్తి బాధ్యత అని పుతిన్ అన్నారు. యుక్రెయిన్ నేతలు ప్రస్తుత చర్యలను కొనసాగించదలుచుకుంటే యుక్రెయిన్ స్వతంత్ర దేశ హోదా ప్రమాదంలో పడినట్టే అని వార్నింగ్ ఇచ్చారు.
”యుక్రెయిన్ పై దాడి.. “కష్టమైన నిర్ణయం”. డాన్‌బాస్ ప్రజలు “వీధి కుక్కలు” కాదు. డాన్‌బాస్ ప్రాంతంలోని ప్రజలను యుక్రెయిన్ ప్రభుత్వం అణిచివేస్తోంది” అని పుతిన్ అన్నారు. పుతిన్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 24న రష్యా సేనలు యుక్రెయిన్ పై దాడులకు దిగాయి. మెజార్టీ పాశ్చాత్య దేశాలు రష్యా చర్యను తప్పుపట్టాయి. దీనిని “అన్యాయమైన”, “చట్టవిరుద్ధమైన” చర్యగా అభివర్ణించాయి. రష్యాపై కఠినమైన ఆంక్షలు విధించాయి.
యుక్రెయిన్ పై 11 రోజులుగా రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. క్షిపణులు, బాంబుల మోతతో యుక్రెయిన్ దద్దరిల్లుతోంది. మూడో అణు విద్యుత్ ప్లాంట్ స్వాధీనం దిశగా రష్యా అడుగులు వేస్తోంది. ఖార్కివ్, మైకోలైవ్, సుమి నగరాలను రష్యా బలగాలు అష్టదిగ్భందం చేశాయి. మరియపోల్, వోల్నోవాఖాలపై రష్యా దాడులు ఉధృతం చేసింది. రష్యా దాడులు కొనసాగుతుండటంతో పౌరుల తరలింపు నిలిచిపోయింది. యుక్రెయిన్ కు సముద్ర మార్గాల సంబంధాలు తెగ్గొటేలా రష్యా దాడులు చేస్తోంది. జైటోమీర్ ప్రాంతంలో 4 యుద్ధ విమానాలను రష్యా కూల్చింది. యుక్రెయిన్ ఎస్ యూ 27 జెట్ లను రష్యా బలగాలు కూల్చివేశాయి. కీవ్ నగరంలోకి రష్యా సేనలు రాకుండా యుక్రెయిన్ సైన్యం పోరాడుతోంది.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్ చేశారు. యుక్రెయిన్ భద్రత, ఆర్థిక సహకారం, రష్యాపై ఆంక్షల కొనసాగింపు లాంటి కీలక అంశాలపై మాట్లాడారు. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైన తర్వాత బైడెన్‌తో జెలెన్ స్కీ ఫోన్ లో మాట్లాడటం ఇది రెండోసారి. మార్చి 6న దాదాపు అరగంట ఫోన్ కాల్ లో చర్చలు జరిగినట్లు జెలెన్ స్కీ తెలిపారు.
ముందెన్నడూ చూడని భీకరమైన దాడిని రష్యా చేస్తుండటంతో.. బాధిత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే అమెరికాను మరోసారి అభ్యర్థించారు. “ఇప్పటికే కొనసాగుతున్న చర్చల్లో భాగంగా మరోసారి అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడాను. యుక్రెయిన్ ను కాపాడుకోవడం.. రష్యాను కంట్రోల్ చేయడంపైనే ఎక్కువగా దృష్టిపెట్టాం” అని జెలెన్ స్కీ చెప్పారు.
అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 350 మిలియన్ డాలర్ల మిలటరీ ఎక్విప్ మెంట్ యుక్రెయిన్ కు చేరనుంది. పాశ్చాత్య దేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి యుక్రెయిన్ కు అందుతోంది. యుక్రెయిన్ పై ఫిబ్రవరి 24, 2022 నుంచి మొదలైన రష్యా యుద్ధం రెండు వారాలుగా కొనసాగుతూనే ఉంది. ప్రధాన నగరాల స్వాధీనమే లక్ష్యంగా భీకర దాడులు కొనసాగిస్తోంది.