Axiom-4 Mission: శుభాంశు శుక్లా రోదసీ యాత్ర.. నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లారు.

Axiom-4
Shubhanshu Shukla Axiom-4 Launch: భారత అంతరిక్ష చరిత్రలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసిలోకి పయనమయ్యారు. ఆయనతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకొని యాక్సియం -4 నింగిలోకి దూసుకెళ్లింది. ప్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ లో బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు చేపట్టిన ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.
ఈ ప్రయోగం మే29న జరగాల్సి ఉన్నప్పటికీ పలు దఫాలుగా వాయిదాపడుతూ వచ్చింది. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. శుభాంశు శుక్లాతోపాటు మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్పెషలిస్టులు టిబర్ కపు (హంగరీ), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ- విస్నియెస్కీ (పోలండ్) రోదశిలోకి వెళ్లారు. ప్రయోగం సక్రమంగా జరిగితే.. భారత కాలమానం ప్రకారం.. గురువారం సాయంత్రం 4.30 గంటలకు వీరి వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం అవుతుంది.
ప్రయోగానికి కొద్ది నిమిషాల ముందు వ్యోమగాములు ఫాల్కన్ 9 రాకెట్ లోని వ్యోమనౌకలోకి వెళ్లి కూర్చుకున్నారు. అందులోకి వెళ్లే ముందు శుభాంశు శుక్లా బాలీవుడ్ సినిమా ‘ఫైటర్’ లోని వందేభారతం అనే పాటను విన్నారు. సాధారణంగా వ్యోమగాములు రోదసియాత్ర చేపట్టే ముందు వారికి ఇష్టమైన సంగీతం వినడం నాసాలో కొంతకాలంగా వస్తోన్న ఆనవాయితీ.