Palestinians Detained: అత్యంత దారుణం, అమానుషం.. 12 గంటలు విమానంలోనే 153 మంది నిర్భందం..

ప్రయాణికులతో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Palestinians Detained: అత్యంత దారుణం, అమానుషం.. 12 గంటలు విమానంలోనే 153 మంది నిర్భందం..

Updated On : November 16, 2025 / 12:06 AM IST

Palestinians Detained: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12 గంటల పాటు విమానంలోనే నిర్బంధించారు. అదీ 153 మంది ప్రయాణికులను. ఈ దారుణమైన, అమానుషమైన ఘటన సౌతాఫ్రికాలో చోటు చేసుకుంది.

153 మంది పాలస్తీనియన్లను దక్షిణాఫ్రికా అధికారులు విమానంలోనే నిర్బంధించారు. వారు ప్రయాణించిన విమానాన్ని దాదాపు 12 గంటలకు పైగా నిలిపివేయడంతో అందులో ఉన్న పిల్లలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణ పత్రాల సమస్యలే ఈ నిర్బంధానికి కారణం.

పాలస్తీనియన్ల విమానం.. కెన్యా నుంచి జొహన్నెస్‌బర్గ్‌లోని టాంబో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగింది. అయితే వారి దగ్గరున్న పత్రాలపై ఇజ్రాయెల్‌ అధికారుల నుంచి నిష్క్రమణ స్టాంపులు, దక్షిణాఫ్రికాలో ఎంతకాలం ఉంటారనే వివరాలు, స్థానిక చిరునామాలు పేర్కొనలేదు. దీంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రయాణికులను నిలిపేశారు. అలా 12 గంటలు విమానంలోనే నిర్బంధించారు.

చివరికి హోం మంత్రిత్వ శాఖ జోక్యంతో స్థానిక ప్రభుత్వేతర సంస్థ పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడానికి ముందుకొచ్చింది. దాంతో పాలస్తీనియన్లు విమానం నుంచి దిగేందుకు అనుమతి ఇచ్చారు.

ప్రయాణికులతో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది చాలా దారుణం, అత్యంత అమానుషం అని మండిపడుతున్నారు. విమానంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పిల్లలు చెమట్లు పట్టి అరుస్తూ, ఏడుస్తూ కనిపించారు. ప్రయాణికులను కనీసం ఎయిర్ పోర్టులోకి అనుమతించి, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోనివ్వాల్సింది అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

రెండు వారాల వ్యవధిలో పాలస్తీనియన్ల విమానం సౌతాఫ్రికాకు రావడం ఇది రెండోసారి. ఇజ్రాయెల్‌ దాడుల తర్వాత చాలామంది పాలస్తీనియన్లు దక్షిణాఫ్రికాలో ఆశ్రయం పొందాలని భావిస్తున్నారు. దక్షిణాఫ్రికా చాలాకాలంగా పాలస్తీనాకు మద్దతుదారుగా ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Also Read: లక్ష గ్లైడ్ బాంబుల తయారీకి ప్లాన్? రష్యాపై యుక్రెయిన్ సంచలన ఆరోపణలు..