థ్యాంక్యూ తమిళనాడు: చివరిరోజున మోడీ ట్వీట్

థ్యాంక్యూ తమిళనాడు: చివరిరోజున మోడీ ట్వీట్

Updated On : October 12, 2019 / 1:08 PM IST

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళనాడు స్వాగతం పలికింది. మమల్లాపురంలో అతనితో కలిసి ప్రధాని మోడీ పర్యటించారు. శుక్రవారం వచ్చిన జిన్ పింగ్… శనివారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చెన్నై దేశాధ్యక్షుడు స్వాగతం పలికేందుకు, ఆతిథ్యమిచ్చినందుకు మద్రాసీయులకు ప్రధాని థ్యాంక్స్ చెప్పారు. 

అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రత్యేకమైన మెసేజ్ చేశారు. ‘తమిళనాడులోని సోదరసోదరీమణులకు ప్రత్యేకమైన థ్యాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి డైనమిక్ రాష్ట్రంలో ఉండడం, వీరి మధ్య గడపడం అద్బుతంగా అనిపించింది. మామళ్లపురంలో సదస్సు నిర్వహించడానికి తమిళనాడు ప్రభుత్వం చేసిన కృషికి కూడా థ్యాంక్స్ చెబుతున్నాను’ అని మోడీ ట్వీట్ చేశారు. 

పర్యటనలో చివరిరోజైన శనివారం జిన్ పింగ్‌కు పట్టు వస్త్రంపై ప్రింట్ చేసిన ఫొటోను గిఫ్ట్ గా ఇచ్చారు. పర్యటన ముగిసిన శనివారం(అక్టోబర్ 12,2019) జిన్‌పింగ్ చెన్నై నుంచి నేరుగా  నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. అంతకు ముందు కోవలంలోని తాజ్‌ ఫిషర్‌మెన్స్‌ కోవ్‌ రిసార్ట్‌లో ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సమావేశమయ్యారు. గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో వాణిజ్యం, ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చించారు. వీరి చర్చల్లో కశ్మీర్‌ అంశం ప్రస్తావనకు రాలేదని అధికారవర్గాలు తెలిపాయి.