Afghanistan: ఆఫ్ఘన్‌లో మారణహోమం.. తాలిబాన్‍‌ల చేతుల్లోకి 421జిల్లాలు

అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టిన వెంటనే.. ఆ దేశంలో మారణహోమం మొదలైంది. తాలిబన్‌లు, ఆఫ్ఘనిస్తాన్‌ దళాల మధ్య బీకర పోరు కొనసాగుతోంది.

Afghanistan: ఆఫ్ఘన్‌లో మారణహోమం.. తాలిబాన్‍‌ల చేతుల్లోకి 421జిల్లాలు

Afghanistan

Updated On : July 4, 2021 / 9:59 PM IST

Taliban: అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్‌ను విడిచిపెట్టిన వెంటనే.. ఆ దేశంలో మారణహోమం మొదలైంది. తాలిబన్‌లు, ఆఫ్ఘనిస్తాన్‌ దళాల మధ్య బీకర పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాలిబాన్‌లు ఆఫ్ఘనిస్తాన్‌లో మొత్తం 421 జిల్లాలను, మొత్తం జిల్లా కేంద్రాలలో మూడవ వంతును వారి నియంత్రణలోకి తీసుకున్నారు. దక్షిణ ప్రావిన్స్‌లో తాలిబన్‌ల స్థావరాలే లక్ష్యంగా ఆఫ్ఘన్‌ వైమానిక దళం ఆపరేషన్‌ చేపట్టింది. ఆ సమయంలో ఆఫ్ఘన్‌ వైమానిక దళాలు, తాలిబన్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది.

ఇద్దరి మధ్య జరిగిన కాల్పుల్లో మూడొందల మంది తాలిబన్‌లు హతమయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు అఫ్ఘాన్ సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘాన్‌ డిఫెన్స్‌శాఖ ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేయగా.. తాలిబన్‌లు మాత్రం నిజం కాదంటూ కొట్టిపారేశారు. మరోవైపు అమెరికా సహా విదేశీ సైన్యం దేశం విడిచి వెళ్లిపోవడంతో అఫ్గాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. పౌరులకు వ్యతిరేకంగా హింసకు పాల్పడుతున్నారు. వారి దురాక్రమణను కూడా కొనసాగిస్తూనే ఉన్నారు.

దేశంలోని కిషిమ్, తక్షన్, బుజార్గ్, తగాబ్ జిల్లాలను తాలిబన్‌లు తమ అధీనంలోకి తీసుకున్నారు. అఫ్గాన్ సైన్యం బలహీనతలను సొమ్ముచేసుకుంటున్న తాలిబన్లు.. పూర్వం తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తెచ్చుకుంటున్నారు. దురదృష్టవశాత్తు, మెజారిటీ జిల్లాలు ఏ మాత్రం పోరాడకుండానే తాలిబాన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి.