ఆ రోజులు పోయాయి… చైనాకి ట్రంప్ స్వీట్ వార్నింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : September 24, 2019 / 03:16 PM IST
ఆ రోజులు పోయాయి… చైనాకి ట్రంప్ స్వీట్ వార్నింగ్

Updated On : September 24, 2019 / 3:16 PM IST

చైనా వాణిజ్య వేధింపులను సహించే సమయం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇవాళ(సెప్టెంబర్-24,2019)యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో చైనాని టార్గెట్ చేశారు. సంవత్సరాలుగా చైనా వాణిజ్య వేధింపులు సహించబడ్డాయి, విస్మరించబడ్డాయి, ఇంకా ప్రోత్సహించబడ్డాయని అన్నారు. అమెరికాకు సంబంధించినంత వరకు ఆ రోజులు ముగిశాయన్నారు. బీజింగ్ వ్యాపార వేధింపులకు సమయం ముగిసిపోయిందని అన్నారు.

ప్రపంచవాదం…ప్రపంచ నాయకులు తమ జాతీయ ప్రయోజనాలను విస్మరించడానికి కారణమైందని వాదించారు. తెలివైన నాయకులు ఎప్పుడూ తమ సొంత ప్రజలకు మంచి మాత్రమే చేస్తారని, దేశాన్ని మొదట అక్కున చేర్చుకుంటారని, భవిష్యత్తు ఎంతమాత్రం ప్రపంచీకరణవాదులది కాదు…దేశభక్తులదే అని ట్రంప్ అన్నారు. 

హాంకాంగ్ ప్రజలకు ప్రజాస్వామ్య జీవితం కోసం అండగా ఉంటామన్నారు. హాంకాంగ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చైనా హ్యాండిల్ చేస్తున్న విధానాన్ని అమెరికా ప్రభుత్వం జాగ్రత్తగా గమనిస్తోందని ట్రంప్ అన్నారు. చైనా ప్రభుత్వం హాంకాంగ్ విషయంలో తన ఒప్పందాన్ని గౌరవిస్తుందని, హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛ,న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్య జీవన విధానాలను కాపాడుతుందని ప్రపంచం పూర్తిగా ఆశిస్తోందని ట్రంప్ అన్నారు.

ఆఫ్గనిస్తాన్ లో కూడా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు ఆశను తన యంత్రాంగం కొనసాగిస్తుందని అన్నారు. దురదృష్టవశాత్తు తాలిబాన్ వారి క్రూరమైన దాడులను కొనసాగిస్తుందన్నారు. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి తాము ఆఫ్గన్ భాగస్వాముల సంకీర్ణంతో కలిసి పని చేస్తాము. శాంతిని నిజం చేసే పనిని తాము ఎప్పటికీ ఆపమని ట్రంప్ అన్నారు.

ఇరాన్ భయంకరమైన ప్రవర్తన కొనసాగుతున్నంతవరకు ఆంక్షలు ఎత్తివేయబడవని ట్రంప్ అన్నారు. ఆంక్షలు ఇంకా కఠినతరం చేయబడతాయన్నారు. వారు మాత్రమే సృష్టించిన సమస్యల కోసం మిగతా వారందరిపై విరుచుకుపడ్డ ఇరాన్ పాలకుల మాటలను 40ఏళ్లుగా ప్రపంచం వినిందని ఆయన అన్నారు. భారత్, పాకిస్తాన్ లు కోరుకుంటే కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్దమని యునైటెడ్ నేషన్స్ లో తను ప్రసంగించే కొద్దిసేపటి ముందు ట్రంప్ తెలిపారు.