Mexico Floods: మెక్సికోలో వరదల బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. 44మంది మృతి..

వరదలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం పెరిగిందని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

Mexico Floods: మెక్సికోలో వరదల బీభత్సం.. విరిగిపడ్డ కొండచరియలు.. 44మంది మృతి..

Updated On : October 13, 2025 / 5:37 PM IST

Mexico Floods: మధ్య, ఆగ్నేయ మెక్సికోలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలకు సంబంధించిన ఘటనల్లో కనీసం 44 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

తుపాను రేమండ్ వల్ల ఏర్పడిన వరదలు ఐదు రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. వెరాక్రూజ్, ప్యూబ్లా, హిడాల్గో, క్వెరెటారో, శాన్ లూయిస్ పోటోసిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.

వెరాక్రుజ్‌ రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి 9 తేదీల మధ్యలో అత్యధికంగా 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో కజొనెస్‌ నది పొంగి ప్రవహించింది. పొజారికా వీధుల్లో నాలుగు మీటర్ల మేర వరద ప్రవహించింది. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

వర్షాల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బురద నీటిలోనే జీవనం సాగిస్తున్నారు. వరదల పరిస్థితిని పరిశీలించేందుకు వచ్చిన మేయర్‌పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై దాడికి యత్నించారు. మేయర్‌ వాహనంపై రాళ్లు రువ్వారు. బురద జల్లారు. విపత్తు సమయంలో ముందస్తుగా తమను ఎందుకు హెచ్చరించలేదని బాధితులు ప్రశ్నించారు.

వరదలకు తోడు కొండచరియలు విరిగిపడటంతో ప్రాణనష్టం పెరిగిందని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

మెక్సికన్ ప్రభుత్వం ప్రకారం వెరాక్రూజ్‌లో 18 మంది, హిడాల్గోలో 16 మంది, ప్యూబ్లాలో 9 మంది, క్వెరెటారోలో ఒకరు మరణించారు. అనేక మంది గల్లంతయ్యారు. దాదాపు 3లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కనీసం 16వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలు .. మరిన్ని కొండచరియలు విరిగిపడటానికి, నదులు పొంగి ప్రవహించడానికి దారితీస్తాయని అధికారులు హెచ్చరించారు. తరలింపులు, రెస్క్యూ ఆపరేషన్లు, సహాయ చర్యల కోసం సైన్యాన్ని మోహరించినట్లు అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ప్రకటించారు. ఈ సంవత్సరం మెక్సికోలో అత్యధిక వర్షపాతం నమోదైంది.

Also Read: ట్రంప్‌కి నోబెల్ మిస్ అయింది కానీ.. ఈ అత్యున్నత పురస్కారం దక్కించేసుకున్నారు..