Today HeadLines : ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

Today HeadLines : ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ

ఆరుగురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ
తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీధర్‌, పశుసంవర్ధక శాఖ సంయుక్త కార్యదర్శి అమోయ్‌ కుమార్‌, వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి టి.వినయ్‌ కృష్ణారెడ్డి, రోడ్లు, భవనాల శాఖ సంయుక్త కార్యదర్శి హరీశ్‌, టీఎస్‌ఐఆర్డీ సీఈవో పి.కాత్యాయని దేవి, గనుల శాఖ డైరెక్టర్‌ సుశీల్‌ కుమార్‌ బదిలీ అయ్యారు.

జనసేన పార్టీకి ఎన్నికల గుర్తు ఖరారు
అమరావతి: జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్థులు పోటీ చేసిన విషయం విదితమే.

మోదీ కీలక సూచనలు
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య బాలరాముడిని దర్శించుకునేందుకు ఇప్పట్లో వెళ్లవద్దని కేంద్రమంత్రులకు ప్రధాని మోదీ సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అయోధ్యలో రద్దీ ఎక్కువగా ఉందని, ఈ సమయంలో కేంద్ర మంత్రులు వెళ్తే వీఐపీ ప్రొటోకాల్స్‌ భక్తులకు అసౌకర్యం కలిగిస్తాయని మోదీ అన్నారు. కేంద్రమంత్రులు మార్చిలో బాలరాముడిని దర్శించుకుంటే బాగుంటుందని మోదీ చెప్పారు.

పవన్‌ కళ్యాణ్‌తో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ
జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ భేటీ అయ్యారు. అనకాపల్లిలో నిర్వహించ తలపెట్టిన బహిరంగసభ, ఉత్తరాంధ్ర అంశాలు పవన్‌ కళ్యాణ్‌తో ఆయన చర్చించారు.

కుప్పకూలిన రష్యా విమానం
రష్యా విమానం కుప్పకూలి 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు మృతి చెందినట్లు తెలుస్తోంది. 74 మందితో వెళ్తున్న విమానం ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో కుప్పకూలినట్లు రష్యా తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది.

ఏసీబీ సోదాలు..
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న కేసులో తనిఖీలు చేపట్టారు. శివబాలకృష్ణ ఇల్లు, బంధువుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో 20 ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు. గతంలో హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో పనిచేసిన శివ బాలకృష్ణ.

దస్తగిరికి బెయిల్ మంజూరు..
వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసు నిందితుడు దస్తగిరికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత 86 రోజుల నుంచి కడప జైలులో దస్తగిరి రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ అవినాశ్ రెడ్డి వలన తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే పలు సందర్భాల్లో దస్తగిరి వాపోయాడు. తాజాగా దస్తగిరి తరపున హైకోర్టులో ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా దస్తగిరి తరుపున జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించనున్నారు.

పదిరోజుల్లో వివరణ ఇవ్వండి..
రెబల్ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కు వైసీపీ శాసన మండలి చైర్మన్ అనర్హత నోటీసులు జారీ చేశారు. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని శాసనమండలి చైర్మన్ కోరారు. ఒక పార్టీ తరుపున ఎమ్మెల్సీగా ఎన్నికై వేరే పార్టీ లో జాయిన్ కావడంతో ఎందుకు అనర్హత వేయ్యకూడదో చేప్పలంటు నోటీసులో పేర్కొన్నారు.

కేసు నమోదు..
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది. రంజిత్ రెడ్డి తనకు ఫోన్ చేసి దుర్భాషలాడారని ఈనెల 20న బంజారాహిల్స్ పీఎస్ లో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కోర్టు అనుమతితో ఐపీసీ 504 సెక్షన్ కింద కేసు నమోదైంది.

భువనేశ్వరి పర్యటన ..
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పేరుతో చేపట్టిన పర్యటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులు కొనసాగనుంది. చంద్రబాబు అరెస్టుకు మనస్తాపంతో చనిపోయిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. నేడు జగ్గంపేట, తుని, పెద్దాపురం, కాకినాడలో భువనేశ్వరి పర్యటిస్తారు. రేపు పి. గన్నవరం, అమలాపురం, రాజోలు, మండపేటలో పర్యటిన కొనసాగుతుంది. 26న అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, రాజానగరంలో భువనేశ్వరి పర్యటన కొనసాగనుంది.

అయోధ్యకు ప్రత్యేక రైళ్లు ..
హైదరాబాద్ నుంచి అయోధ్యకు 17ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 29వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. నెల రోజుల్లో 41 ట్రిప్పులు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది.

దరఖాస్తులు స్వీకరణ ..
నేటి నుంచి విజయవాడలోని ఆంధ్రరత్నభవన్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ దరఖాస్తులు స్వీకరించారు.