Headlines: రేవంత్ రెడ్డి మరో సంచలనం

భార్యకు 18 ఏళ్లకు పైబడి వయసు ఉంటే భారతీయ శిక్ష్మాస్మృతి ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.

Headlines: రేవంత్ రెడ్డి మరో సంచలనం

Today Headlines in Telugu at 11PM

పరిపాలనలో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ ప్రక్షాళన
సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. పరిపాలనలో తనదైన మార్క్ వేస్తున్నారు. పలు కీలక, సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి. నిన్న ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇవాళ 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం నియమించిన వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు, పదవీ కాలం నిర్ణయాలను రద్దు చేసింది రేవంత్ సర్కార్. 54 కార్పొరేషన్లకు సంబంధించిన ఛైర్మన్ల నియామకాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీశైలంలో మరోసారి భారీ ట్రాఫిక్ జామ్
శ్రీశైలం ఘాట్ రోడ్డులో మరోసారి భారీ ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం నుంచి సుమారు ఆరు కిలోమీటర్ల మేర వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. శ్రీశైలం నుంచి ముఖద్వారం వరకు రోడ్లపై భక్తుల కార్లు బస్సులు నిలిచిపోయాయి.

అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
భార్యపై శృంగారం విషయంలో అలహాబాద్ హైకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. భార్యకు 18 ఏళ్లకు పైబడి వయసు ఉంటే భారతీయ శిక్ష్మాస్మృతి ప్రకారం వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అసహజ శృంగారం చేశారనే ఆరోపణలపై భర్తను నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఐపీసీ సెక్షన్ 377 కింద వైవాహిక అత్యాచారం నేరంగా పరిగణించలేమని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది.

ఎన్టీఆర్‌పై నాకు కోపం లేదు
టాలీవుడ్ నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ఆడియన్స్ కి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన బండ్ల గణేష్.. 2009లో రవితేజ ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా మారారు. ఇక రెండు సినిమాని ఏకంగా పవన్ కళ్యాణ్ తోనే నిర్మించారు. ‘తీన్‌మార్’తో ప్లాప్ ని అందుకున్న బండ్ల గణేష్.. మూడో సినిమా ‘గబ్బర్ సింగ్’తో ఇండస్ట్రీ హిట్టుని అందుకున్నారు. ఆ తరువాత ఎన్టీఆర్‌తో బాద్‌షా, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో, రామ్ చరణ్‌తో గోవిందుడు అందరివాడేలే సినిమాలు తెరకెక్కించారు.

ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం
సీపీఎస్ రద్దు చేయలేదన్న బాధతో ఓ ప్రభుత్వ టీచర్ ఆత్మహత్యాయత్నం చేశారు. విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఉపాధ్యాయుడు మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. తన చావుకు సీఎం జగనే కారణమని బాధితుడు లేఖ రాశారు.

మాయావతి సంచలన ప్రకటన
బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆదివారం సంచలన ప్రకటన జారీ చేశారు. తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ అని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని పునర్నిర్మించే సవాలు ఆకాష్ స్వీకరించారని మాయావతి చెప్పారు. లక్నోలో జరిగిన బీఎస్పీ అఖిల భారత పార్టీ సమావేశంలో మాయావతి ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

తల తాకట్టు పెట్టైనా అమలు
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇప్పుడు రెండు పథకాలను అమలు చేశామని తెలిపారు. మహిళ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ స్కీమ్ లను అమలు చేశామని పేర్కొన్నారు. మిగతా హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. తల తాకట్టు పెట్టి ఐనా హామీలను అమలు చేస్తామని చెప్పారు.

ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటాం
అధికారం కోల్పోయిన మాజీ మంత్రులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం గాంధీభవన్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. ప్రభుత్వం ఏర్పడి రెండు రోజులే అయింది. అదికాలేదు.. ఇది కాలేదు.. అని విమర్శిస్తే ఎలా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పాలకులు ఆగం పట్టించారని పొన్నం విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రెండు గ్యారెంటీ స్కీములు మొదలు పెట్టినం.. 119 నియోజకవర్గాల్లో రెండు గ్యారెంటీ స్కీములు అమలవుతున్నాయని పొన్నం చెప్పారు.

కీలక నిర్ణయం ..
త్వరలో సీఎం క్యాంప్‌ ఆఫీస్‌గా MCHRD మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. ఇప్పటి వరకు సీఎం అధికారిక భవనంగా ప్రగతి భవనం ఉంది. అయితే, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి తన సొంత భవనంలోనే నివాసం ఉంటున్నారు.

కాంగ్రెస్‌పై విమర్శలు ..
కాంగ్రెస్‌ ఎంపీ ఇంట్లో వందల కోట్ల నగదు దొరికినా రాహుల్ గాంధీ ఎందుకు నోరుమెదపడం లేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. డబ్బులు లెక్కించే యంత్రాలుసైతం వేడెక్కి మోరాయిస్తున్నాయి.. తప్పితే లెక్కించడం పూర్తికావడం లేదని కిషన్ రెడ్డి అన్నారు.

కేసీఆర్ కు సీఎం రేవంత్ పరామర్శ..
సోమాజిగూడ యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. రేవంత్ వెంట మంత్రి సీతక్క, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ త్వరలో కోలుకుని అసెంబ్లీకి రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయసహకారాలు కావాలన్నా అందిస్తామని తెలిపారు.

తప్పు చేస్తే శిక్ష..
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్షసాధింపులు ఉండవని, కానీ, ఎవరైనా అధికారులు తప్పులు చేస్తే శిక్ష తప్పదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

బరిలో ఉంటా..!
వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్‌ నుంచి పోటీ చేస్తానని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. టికెట్‌ ఇవ్వకపోతే ఆప్షన్‌ బీ కూడా నా వద్ద ఉదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సుదీర్ఘ పోరాటం..
ఈనెల 17న రాజధాని రైతులు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ హాజరు కానున్నారు.

కౌంటర్‌ అటాక్‌ ..
రైతులను చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో వ్యవసాయానికి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. రైతులకు ఎవరు మేలు చేశారో చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి సవాల్‌ చేశారు.

చాన్స్‌ ఎవరికో..!
ఛత్తీస్‌గఢ్ లోని రాయ్ పుర్ లో ఇవాళ బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. ఇటీవల ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమత్రి అభ్యర్థిని నిర్ణయించనున్నారు. ఈ భేటీకి పరిశీలకులుగా కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, పార్టీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ హాజరు కానున్నారు.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం ..
ఉత్తరప్రదేశ్ బరేలీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి కారు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. ప్రమాద కారణంగా ట్రక్కు, కారుకు మంటలు వ్యాపించి దగ్దమయ్యాయి.

వచ్చేది వైసీపీనే..
ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీనేనని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు ఆంధ్రాకు సంబంధం లేదని, తెలంగాణలో కాంగ్రెస్ విజయంసాధించినా ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదని అన్నారు. మళ్లీ తప్పకుండా వైసీపీ అధికారంలో వస్తుందని చెప్పారు.

భారీ వర్షాలకు అవకాశం..
దక్షిణ భారతదేశంలో ఇవాళ్టి నుంచి పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జార్ఖండ్‌, బీహార్, పశ్చిమ బెంగాల్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, చత్తీస్‌గఢ్ ,ఒడిశా, మధ్యప్రదేశ్ , కోస్తాంధ్ర, తమిళనాడు, కేరళ అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంజాబ్ ,హర్యానా, ఢిల్లీలో దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

సఫారీల సవాల్‌కు సై..
నేటి నుంచి సౌతాఫ్రికా, భారత మధ్య టీ20 సమరానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ తొలి ట్వీ20 జరుగనుంది. తొలి పోరులో టీమ్‌ ఇండియా.. ఆతిథ్య దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో 4-1తో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్‌ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఆ దేశానికి వెళ్లింది. ఎలాగైనా సౌతాఫ్రికాను వారి సొంతగడ్డలో ఓడించి కప్‌ ఎరగేసుకురావాలని యువ భారత్‌ ఉవ్విళ్లూరుతోంది.

కేసీఆర్ ను పరామర్శించిన చినజీయర్ ..
హైదరాబాద్‌ సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పలువురు పరామర్శిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి పరామర్శించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్‌ను “మై రాక్ స్టార్” అంటూ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కేసీఆర్ వాకర్ సాయంతో నడుస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

క్షిపణి దాడులు ..
ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా క్షిపణి దాడులు జరిగాయి. కార్యాలయం కాంపౌండ్‌ లోపల సుమారు ఏడు మోర్టర్ రౌండ్ల మిస్సైల్స్‌ దాడి జరిగిందని అమెరికా మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఇరాక్‌లో ఈ మధ్య కాలంలో అమెరికా రాయబార కార్యాలయం లక్ష్యంగా జరిగిన అతిపెద్ద దాడిగా ఈ క్షిపణి దాడిని అభివర్ణించారు.

అంధకారంలో శ్రీలంక ..
శ్రీలంకను విద్యుత్‌ సమస్య చుట్టు ముట్టింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ఈ మేరకు విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. కాట్‌మలే-బియగమా మధ్య ప్రధాన విద్యుత్‌ లైనులో సమస్య ఏర్పడంతో సరఫరాకు అంతరాయం తలెత్తినట్లు తెలుస్తోంది.

గర్భగుడి ఫొటోలు విడుదల ..
అయోధ్యలో రామ మందిర పునః నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మంది హిందువుల కల సాకారం కాబోతోంది. వచ్చేఏడాది జనవరి 22న ఆలయం ప్రారంభోత్సవ వేడుక జరుగనుంది. ఈ క్రమంలో ఆలయ గర్భగుడి ఫొటోలను రామ జన్మ భూమి తీర్ధక్షేత్ర ట్రస్ట్‌ విడుదల చేసింది.

మోదీయే మళ్లీ విశ్వ నాయకుడు
ప్రపంచ అగ్రనేతల జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి అగ్రభాగాన నిలిచారు. ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆన్‌లైన్‌ సర్వేలో ఆయనకు 76శాతం రేటింగ్‌ లభించింది. తమ దేశాల్లో ఆమోదయోగ్య ప్రజా నేతలుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు 37శాతం రేటింగ్ లభించింది. అంతేకాదు… కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోకు 31శాతం, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు 25శాతం, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌నకు 24శాతం రేటింగ్‌ వచ్చింది.

శ్రీనగర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు ..
శ్రీనగర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బెమినాలోని హమ్దానియా కాలనీలో ఓ పోలీస్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన పోలీస్‌ను మహ్మద్‌ హఫీజ్‌గా గుర్తించారు. కాల్పుల్లో గాయపడ్డ ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి.

ఢిల్లీ మరోసారి వాయు కాలుష్యం
దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధిలో మరోసారి వాయు కాలుష్యం పెరిగింది. ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 321కి చేరింది. ఎన్‌సీఆర్‌ పరిధిలో 27 ప్రాంతాల్లో వాయు కాలుష్యం దారుణంగా ఉండగా.. ఆరు ప్రాంతాల్లో మరింత అధ్వాన్నంగా నమోదైంది. ఎల్లుండికి వాయు కాలుష్యం మరింత పెరగవచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. ఫరీదాబాద్‌లో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 240, ఘజియాబాద్‌లో 242, నోయిడాలో 242, గ్రేటర్ నోయిడాలో 260, గురుగ్రామ్‌లో 251 వద్ద ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ నమోదైంది.

ఐరిస్‌ ఆధారంగా ఆధార్‌ జారీ ..
ఆధార్‌ కార్డు నమోదుకోసం కొత్త ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఫింగర్‌ ప్రింట్స్‌ అందించలేని వారికి ఐరిస్‌ ద్వారా ఆధార్‌ కార్డు కోసం నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఆధార్‌ జారీకి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. కేరళలోని ఓ మహిళ ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కోసం ఎదుర్కొన్న ఇబ్బంది వెలుగులోకి వచ్చాక ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది.