Headlines : మరో కీలక అధికారి రాజీనామా.. టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!

తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన రైతుబంధు నిధులను రైతు ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Headlines : మరో కీలక అధికారి రాజీనామా.. టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!

11PM Headlines

Updated On : December 12, 2023 / 10:58 PM IST

TSPSC సభ్యత్వానికి రాజీనామా చేసిన 5 గురు కమిషన్ సభ్యులు
టీఎస్పీఎస్పీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేసిన మరుసటి రోజే అంటే ఈరోజు (డిసెంబర్ 12) మరో ఐదుగురు సభ్యులు రాజీనామా చేశారు. వాస్తవానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోదింనేలేదు. ఈ నేపథ్యంలో మరో ఐదుగురు రాజీనామా చేయడం ఆసక్తి నెలకొంది.
1.బండి లింగారెడ్డి
2.కోట్ల అరుణ కుమారి
3.సుమిత్రా ఆనంద్
4.కారెం రవీంద్ర రెడ్డి రాజీనామా

టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!
ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. ఓపక్క వైసీపీ ఇంఛార్జిల మార్పుతో కలకలం చెలరేగగా.. మరో సంచలన విషయం వెలుగుచూసింది. గతంలో వైసీపీ వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిశోర్.. టీడీపీకి టచ్ లోకి వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ పరిణామాల అనంతరం.. పీకే.. టీడీపీకి టచ్ లోకి వచ్చినట్లు ఏపీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
గ్యాస్‌ ఏజెన్సీలకు పోటెత్తిన జనం
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రూ.500కే గ్యాస్ సిలిండర్ హామీపై తెలంగాణ వ్యాప్తంగా వదంతులు వ్యాపిస్తున్నాయి. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కావాలంటే వినియోగదారులు కేవైసీ చేయించుకోవాలి, లేదంటే సబ్సిడీ మొత్తం కూడా చెల్లించాల్సి ఉంటుంది.. ఇదీ రూ.500కే సిలిండర్ పథకానికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న వదంతులు. వాస్తవానికి ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు ప్రభుత్వం. కనీసం ఒక్క సమీక్ష కూడా నిర్వహించింది లేదు.
జగన్‌పై సింగిల్‌గా పోటీ చేసే ధైర్యముందా?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు వైసీపీ ఎంపీ నందిగం సురేశ్. సీఎం జగన్ పై సింగిల్ గా పోటీ చేసే ధైర్యముందా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను అవమానించారు అని ఎంపీ సురేశ్ మండిపడ్డారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు జగన్ కి సంపూర్ణ మద్దతిస్తున్నారు అని చెప్పారు. జగన్ పాలనతో ఏపీలో పేదరికం తగ్గిందన్నారు. ఆకలి తీర్చే నాయకుడు కావాలో – మోసం చేసే నాయకుడు కావాలో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
మరో కీలక అధికారి రాజీనామా
టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, జర్నలిస్ట్ ఆర్ సత్యనారాయణ తన పదవీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం నిరుద్యోగుల కోసం ఓలేఖ రాశారు.

ఎవ్వరు రావద్దు..
తనను చూసేందుకు యశోద ఆస్పత్రికి ఎవ్వరు రావద్దు అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియో విడుదల చేశారు. తనను చూసేందుకు రావటం వల్ల తనతో పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఇబ్బంది కలుగుతోందన్నారు. తన వల్ల..ఇతర రోగులు ఇబ్బందులు పడకూడదన్నారు. తాను త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తాను అంటూ కేసీఆర్ వీడియోలో తెలిపారు.

బ్రాహ్మణుడే సీఎం
రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్ లాల్ శర్మ..బీజేపీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా భజన లాల్ శర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భజన్ లాల్ శర్మను రాజస్థాన్ సీఎంగా బీజేపీ అధిష్టానం ప్రకటించింది.

తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది రౌస్ అవెన్యూ కోర్టు.ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్ పిటీషన్ ను డిసెంబర్21న తీర్పు ఇవ్వనుంది. లిక్కర్ స్కామ్ కేసులో అక్టోబర్ 4 నుంచి సంజయ్ సింగ్ ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

విచారణ వాయిదా..
ఫైబర్‌నెట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ  జనవరి 17కి వాయిదా పడింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ జరిపింది. కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ధర్మాసనం సూచించింది.

తుమ్మల సమీక్ష..
సచివాలయంలో మార్కెటింగ్ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం అధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుపైనా సమీక్షించిన తుమ్మల.. సాగు వివరాలు, రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు తదితర విషయాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

జగన్ పై వ్యతిరేకత..
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ హెలికాప్టర్ లో తిరిగితే ప్రజల కష్టం ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని అన్నారు.

సంపూర్ణ మద్దతు ..
అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నారా లోకేశ్ అన్నారు. అందరినీ చేసినట్లే జగన్ అంగన్వాడీలను మోసం చేశాడని, పనికి తగ్గ వేతనం ఇస్తానని జగన్ మాట తప్పారని లోకేశ్ విమర్శించారు.

పెద్దపులి కలకలం ..
నాగర్ కర్నూల్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతోంది. కొల్లాపూర్ మండలం అమరగిరి సమీపంలోని కోతిగుండుపొదలో దాగిఉన్న పెద్దపులిని గమనించకుండా మేకలను మేతకోసం యాజమాని తీసుకెళ్లాడు.. సమీపంలోని పులి మేకను వేటాడి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

లోకేశ్‌ సెటైర్లు ..
ఆంధ్రప్రదేశ్‌ను ప్రభుత్వం అన్ని రంగాల్లో నాశనం చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ విమర్శించారు. ప్రభుత్వం తీరుతో యువత నిరాశతో కొట్టుమిట్టాడుతోందని అన్నారు.

మళ్లీ నోటీసులు ..
ఆర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ. 20కోట్ల రుణంతోపాటు వడ్డీ రూ. 25కోట్లు మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు.

వరుణగండం..
సౌతాఫ్రికా వర్సెస్ భారత్ జట్ల మధ్య ఇవాళ రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు వరుణ గండం పొంచిఉంది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

సస్పెన్షన్ ఎత్తివేత ..
ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ పై ఈసీ సస్పెన్షన్ ఎత్తివేసింది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదన్న అంజనీకుమార్ విజ్ఞప్తిని ఈసీ పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది.

రేపే ప్రమాణ స్వీకారం ..
మధ్యప్రదేశ్‌ సీఎంగా మోహన్‌ యాదవ్‌ను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మోహన్ యాదవ్ దక్షిణ ఉజ్జయిని నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే, రేపు సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇందుకోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజీనామా..
TSPSC ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌ రెడ్డి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కలిసిన తరువాత ఆయన తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామాకు ముందు బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఆ తర్వాత గవర్నర్‌ తమిళిసైకి జనార్దన్‌ రెడ్డి రాజీనామా సమర్పించగా, అందుకు ఆమె ఆమోదం తెలిపారు. తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్‌ లేఖ రాశారు.

బస్సుల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు!
బస్సుల్లోనూ యూపీఐ పేమెంట్‌ సర్వీసులను మహారాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. బస్సుల్లో ప్రయాణించేవారు ఇకపై టిక్కెట్ల కొనుగోలుకు డిజిటల్‌ చెల్లింపులు చేయవచ్చని మహారాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్‌ ప్రకటించింది. ఈ మేరకు అన్నిబస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో యూపీఐ పేమెంట్‌ సర్వీసులను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది.

వైసీపీలో కీలక మార్పులు ..
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో భారీ మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ఇంచార్జీలను మార్చాలని నిర్ణయించారు. ఏకంగా 62 చోట్ల ఇన్ చార్జీలను మార్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం 11చోట్ల ఇంచార్జీలను మార్పులు చేశారు. నిన్న మార్చిన 11 మంది ఇంచార్జీల్లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. వీరిలో ముగ్గురు మంత్రులు ఉన్నారు.

ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్ కల్యాణ్
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు. త్వరలో వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇందుకు విజయనగరం జిల్లాలోని భోగాపురం వేదికకానుంది. టీడీపీ నాయకుడు నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం యాత్ర ఈనెల 20న ముగియనుంది. విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలెపల్లిలో ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ హాజరుకానున్నారు. టీడీపీ – జనసేన పొత్తు ప్రకటన చేసిన తర్వాత ఒకే వేదికపైకి చంద్రబాబు, పవన్‌ రావడం ఇదే తొలిసారి. ఈ సభకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా హాజరుకానున్నారు.

డ్రగ్స్‌ రహిత తెలంగాణే లక్ష్యం ..
తెలంగాణలో మాదక ద్రవ్యాల చలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. నార్కోటిక్స్‌ కంట్రోల్‌ అంశంపై ఆయన సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను వినియోగించినా.. విక్రయించినా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్‌ బ్యూరోకు పూర్తి స్థాయి డైరెక్టర్‌ను నియమించడంతోపాటు.. ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. నార్కోటిక్‌ విభాగానికి కావాల్సిన నిధులు, వనరులు ఇతర సౌకర్యాలను సమకూర్చాలని రేవంత్‌రెడ్డి అన్నారు.

ప్రజాదర్బార్‌కు బదులు ప్రజావాణి..
ప్రజా దర్బార్‌పై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా దర్బార్‌ పేరును మార్చేసింది. ఇక నుంచి ప్రజా దర్బార్‌కు బదులుగా.. ప్రజావాణిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ప్రజావాణిని ఇకపై వారంలో రెండు రోజులే నిర్వహించనుంది. ప్రతి మంగళవారం, శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది. ఉదయం 10గంటల్లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి వినతులు ఇచ్చేందుకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలిపింది.

రైతుబంధుకు గ్రీన్‌సిగ్నల్‌..
తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నదాతలకు తీపి కబురు అందించింది. ఎన్నికల సందర్భంగా నిలిచిపోయిన రైతుబంధు నిధులను రైతు ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు నిధులను ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలన్నారు. అదేవిధంగా రైతులకు రెండు లక్షల రూపాయల మేరకు రుణమాఫీ చేసేందుకై తగిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు.