Top Headlines : వైసీపీలో చేరిన పలువురు జనసేన నేతలు.. హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వేదికగా పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు.

వైసీపీలో చేరిన పలువురు జనసేన నేతలు
ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయం వేదికగా పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్, ఆ పార్టీ స్థానిక నాయకులు యడ్లపల్లి లోకేశ్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీశ్, ప్రసాద్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువాలు కప్పి వారిని వైసీపీలోకి ఆహ్వానించారు జగన్. ఆ సమయంలో మంత్రి జోగి రమేశ్ వారితో పాటే ఉన్నారు.
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఎస్ ఆర్ నగర్ లోని సర్వీస్ అపార్ట్ మెంట్ లో నార్కోటిక్ బ్యూరో సోదాలు నిర్వహించింది. బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి కొందరు యువకులు డ్రగ్స్ తీసుకుని వచ్చినట్లు నార్కోటిక్ బ్యూరో అధికారులు గుర్తించారు. మొత్తం 12 మందిని అరెస్ట్ చేశారు.
కేజ్రీవాల్‌కు మళ్లీ నోటీసులు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు పిలిచింది. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో డిసెంబర్ 21న హాజరు కావాలని ఈడీ కోరింది. అంతకుముందు నవంబర్ 2న ఇదే విషయమై కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసు పంపింది.
పార్లమెంట్ నుంచి 92 మంది ఎంపీల సస్పెన్షన్
పార్లమెంట్ చరిత్రలో ఎప్పుండూ ఇంత మంది సస్పెండ్ కాలేదు. ఉభయ సభల్లో కలిపి ఏకంగా 92 మంది ఎంపీల మీద సస్పెన్షన్ వేటు వేశారు. వీరందరినీ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రత లోపానికి సంబంధించి రాజ్యసభ, లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనను ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశం పార్లమెంటును కుదిపివేస్తోంది. కాగా, గతంలో రాజీవ్ గాంధీ హయాంలో 63 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఆ రికార్డును తిరగరాస్తూ.. మోదీ హయాంలో ఏకంగా 92 మంది ఓకేసారి సస్పెండ్ అయ్యారు.
ఈ నెల 23 నుంచి వైకుంఠద్వార దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠద్వార దర్శనం చేసుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ పది రోజుల్లో ఏ రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నా శ్రీవారి భక్తులకు ఒకే రకమైన పుణ్యఫలం లభిస్తుందని చెప్పారు.
పెళ్లి ఫొటో షేర్ చేసిన కేటీఆర్
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఇవాళ 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ తన భార్యాపిల్లల ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన భార్యకు థ్యాంక్స్ చెప్పారు.
Happy 20th anniversary to my beautiful wife Shailima
Thank you for being a huge pillar of support over the last 2 decades and for giving me two beautiful kids and a being a great partner in this journey
Here’s to many more years of togetherness pic.twitter.com/8UTpKRXExr
— KTR (@KTRBRS) December 18, 2023
బాధ్యత మీదే..
తెలంగాణ లోక్‌సభ స్థానాలకు ఇంచార్జ్‌లుగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు రెండే లోక్‌సభ స్థానాల బాధ్యతల్ని అప్పగించారు. చేవెళ్ల, మహబూబ్‌నగర్ ఇంచార్జ్‌గా రేవంత్ రెడ్డి, అదిలాబాద్, మహబూబాబాద్ ఇంచార్జ్‌గా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్లగొండ, పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్, జూపల్లికి నాగర్ కర్నూల్, పెద్దపల్లికి శ్రీధర్ బాబు,భవనగిరికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇలా ఆయా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు.
ఏకగ్రీవం..
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది పీఏసీ. అలాగే, తెలంగాణలో గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. డిసెంబర్ 28 నుంచి 15 రోజుల పాటు గ్రామ సభలు ఉంటాయి.
డిమాండ్ కంటిన్యూ..
పార్లమెంటు భద్రత లోపానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు తమ డిమాండ్లపై కొనసాగిస్తున్నాయి. దీనిపై లోక్‌సభ, రాజ్యసభల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. దీనిపై లోక్ సభ స్పీకర్ ఎంతగా సభ్యులకు సర్ధి చెబుతున్నా..భద్రతా ఘటనపై దర్యాప్తు జరుగుతోందని చెబుతున్నా వినటంలేదు. హోమ్ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో లోక్‌సభ శీతాకాల సమావేశాల నుంచి కాంగ్రెస్ విపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మంది ఎంపీలను లోక్‌సభ స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే 13 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ కొనసాగుతోంది. వీరందరినీ ఈ శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు. వాస్తవానికి, లోక్‌సభ భద్రత ఉల్లంఘనపై ఉభయ సభలలో (లోక్‌సభ, రాజ్యసభ) ప్రకటన ఇవ్వాలని ప్రతిపక్షాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నిరంతరం డిమాండ్ చేస్తున్నాయి.
దావూద్ ఉన్నాడా…?పోయాడా..?
అండర్ వరల్డ్ గ్యాంగ్ స్టర్ దావూద్ ఇబ్రహీం మరణించాడంటూ పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ట్వీట్ చేశారు. కానీ కాసేపటికే డిలీట్ చేశారు. దావూద్ ఇబ్రహీంపై విషప్రయోజం జరిగిందని..అతని కరాచీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడని వార్తలు వచ్చాయి. అతని పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వెలువడ్డాయి. ఈక్రమంలో దావూద్ మరణించాడంటూ పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ట్వీట్ చేయటం..కాసేపటికే డిలీట్ చేయటం చర్చనీయంగా మారింది. ఈక్రమంలో దావూద్ జీవించే ఉన్నాడా… లేదా చనిపోయాడా..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిణామాల మధ్య పాకిస్థాన్ లో ఇంటర్నెట్ నిలిపివేశారు.
రాజకీయం చెయ్యొద్దు..
భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు జరగకుండా సభ్యులు ఇచ్చిన సూచనలు అమలు చేస్తాం అంటూ పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై స్పీకర్ ఓం బిర్లా లోక్ సభలో ప్రకటన చేశారు. పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని తెలిపారు. పార్లమెంట్ భద్రతా వైఫల్య ఘటనను రాజకీయం చేయడం తగదని సభ్యులకు సూచించారు. సభా మర్యాదలు,గౌరవాన్ని అందరూ పాటించాలని కోరారు.
ఎన్ఐఏ సోదాలు..
దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఎన్ఐఏ అధికారులు దక్షిణాదిలో ఏకకాలంలో 19 చోట్ల సోదాలు చేస్తున్నారు. జీహాద్ టెర్రర్ గ్రూప్ లక్ష్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.
టీడీపీ, జనసేన కీలక ప్రకటన
నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈరోజు విశాఖ జిల్లాలోని అగనంపూడి వద్ద పాదయాత్ర ముగినుంది. యువగళం ముగింపు సభను అత్యంత భారీగా నిర్వహించనుంది టీడీపీ. విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం ముగింపు సభ జరుగనుంది. ఈ సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. అంతేకాదు టీడీపీ-జనసేన ఈ సభ నుంచే కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయని సమాచారం. అలాగే ఇదే సభనుంచి ఇరు పార్టీలు ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
మరోసారి మహమ్మారి ముప్పు..
భారతదేశంలో మళ్లీ కొవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. దేశంలో తాజాగా 335 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ మహమ్మారితో బాధపడుతున్న అయిదుగురు మరణించడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేరళ రాష్ట్రంలో నలుగురు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒకరు కరోనాతో మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
తప్పిన ప్రమాదం..
అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు ప్రమాదం తప్పింది. విల్మింగ్టన్ లో బైడెన్ కాన్వాయ్ ను కారు ఢీకొట్టింది. ఆ సమయంలో బైడెన్ కాన్వాయ్ దగ్గర నిల్చుని ఉన్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు.
భారీ వర్షాలు ..
తమిళనాడును భారీవర్షాలు వదలటం లేదు. తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాసి జిల్లాల్లో అతి భారీవర్షాలు కురిశాయి. దీంతో ఐఎండీ నాలుగు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదివారం అర్థరాత్రి దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిశాయి. సోమవారం తెల్లవారుజామున కూడా పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. మరోవైపు కేరళ రాష్ట్రంలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పసిడి బాండ్ల విక్రయం..
సార్వభౌమ పసిడి బాండ్ పథకం 2023 – 24 సిరీస్ 3 నేడు (డిసెంబరు 18) ప్రారంభమై 22న ముగియనుంది. పసిడి బాండ్లకు గ్రాము ధరను రూ. 6,199గా నిర్ణయించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి, చెల్లింపులను డిజిటల్ పద్దతిలో చేసేవారికి గ్రాముకు రూ. 50మేర రాయితీ ఇవ్వనున్నారు.
ఢిల్లీకి రేవంత్ ..
త్వరలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మలి విస్తరణలో తమకు అవకాశం వస్తుందని పలువురు నేతలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 19న ఢిల్లీ వెళ్లి అగ్రనేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మలివిడత మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే విషయంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.
బస్సు అద్దాలు ధ్వంసం ..
బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ ను యూట్యూబర్, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. రన్నరప్ గా సీరియల్ నటుడు అమరదీప్ నిలిచాడు. అయితే, ఆదివారం రాత్రి అన్నపూర్ణా స్టేడియం వద్దకు భారీ సంఖ్యలో ప్రశాంత్, అమర్ అభిమానులు చేరుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న కొండాపూర్ – సికింద్రాబాద్ ఆర్టీసీ బస్సుపై రాళ్లదాడి చేయడంతో బస్సు అద్దం పగిలింది.
శబరిమలలో ప్రత్యేక గేటు..
శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే చిన్నారులు సులభంగా మణికంఠుడి సన్నిధికి చేరుకునేందుకు వీలుగా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) ఆదివారం నుంచి ప్రత్యేక గేటు వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదివారం ఉధయం నుంచి చిన్నారులకు ముందు వరుసలో అయ్యప్ప దర్శనం కల్పిస్తున్నారు. దీంతో వారికి పొడవైన క్యూలైన్ల బాధ తప్పింది. ఈ చర్య చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కేరళ వెలుపలి నుంచి వచ్చిన భక్తులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని టీబీడీ తెలిపింది. మరోవైపు శబరిమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా త్వరలో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు టీబీడీ తెలిపింది.