Today Headlines: ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన జగన్
175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్.. 60 నుంచి 65 చోట్ల మార్పులు చేర్పులు చేశారు.

Today Headlines in Telugu at 11PM
ఒకేసారి 175 మంది పేర్లు ప్రకటన
అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీఎం జగన్ స్పీడ్ పెంచారు. 2024 ఎలక్షన్ టీమ్ ను అప్పుడే సిద్ధం చేసేశారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఫైనల్ లిస్ట్ ను రెడీ చేశారు. 175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్.. 60 నుంచి 65 చోట్ల మార్పులు చేర్పులు చేశారు. దీనిపై రేపు లేదా ఎల్లుండి ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక, కొత్త సంవత్సరం నుంచి అభ్యర్థులంతా ప్రజల్లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది.
టీమిండియా ఓటమి
సౌతాఫ్రికాలోని సెంచూరియన్ సూపర్‌స్పోర్ట్ పార్క్‌లో జరిగిన భారత్-దక్షిణాఫ్రికా మొదటి టెస్ట్ మ్యాచులో ఇండియా ఓటమి పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (76 పరుగులు), శుభ్‌మన్ గిల్ (26) మినహా ఎవరూ రాణించలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగులతో విజయం సాధించింది.
మరణశిక్షను తగ్గించిన ఖతార్ కోర్టు
ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష పడిన ఎనిమిది మంది భారత మాజీ నేవీ అధికారులకు కోర్టులో ఊరట లభించింది. వారి మరణశిక్షను జైలు శిక్షకు తగ్గిస్తూ అక్కడి న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ విషయాన్ని తెలుపుతూ భారత విదేశాంగ శాఖ ఇవాళ ఓ ప్రకటన చేసింది.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తామని ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించింది.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు
ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు ప్రాక్టికల్స్
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు
వంశీకృష్ణ శ్రీనివాస్‌పై అమర్‌నాథ్ ఫైర్
విశాఖ వైసీపీ నేత, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేన పార్టీలో చేరడంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. వంశీకృష్ణ తమ పార్టీని వదిలి వెళ్లడం ఆత్మహత్య సదృశ్యమేనని చెప్పారు. వైసీపీలో ఆయనకు పదవులు ఇచ్చి గౌరవించామని అన్నారు. అయినప్పటికీ ఆయన పార్టీ మారారని, ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు నష్టం లేదని చెప్పారు.
ఈవీఎంలపై శ్యామ్ పిట్రోడా సంచలన కామెంట్స్
దేశంలో మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగాల్సి ఉన్న వేళ ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శ్యామ్ పిట్రోడా మరోసారి ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యాలు చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి శ్యామ్ పిట్రోడా సన్నిహితుడు. తాజాగా శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ… లోక్‌సభ ఎన్నికల కంటే ముందే ఈవీఎంలను సరిచేయాలని, లేదంటే బీజేపీ ఈ ఎన్నికల్లో 400కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని చెప్పారు.
హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా ..
కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్ కు వెళ్లారు. అక్కడ టీబీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.
– మధ్యాహ్నం 3.05 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారానికి అమిత్ షా శ్రీకారం చుట్టనున్నారు.
– కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్ కు చేరుకుంటారు. బీజేపీ విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. మండల ఆ పైస్థాయి నాయకులతో మొదటి సమావేశం నిర్వహిస్తారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ముఖ్యనేతలతో అమిత్ షా భేటీ అవుతారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తారు.
– సాయంత్రం 5.40 గంటలకు నోవాటెల్ చేరుకుంటారు. అక్కడ బీజేపీ నేతలతో వేర్వేరుగా అమిత్ షా సమావేశం అవుతారు.
– రాత్రి 6.50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లారు.
కొనసాగుతున్న చర్చలు..
ఏపీలో మంత్రి ఆదిమూలపు సురేశ్ తో మున్సిపల్ కార్మికుల చర్చలు కొనసాగుతున్నాయి. సంఘాల వారీగా మంత్రి చర్చల జరుపుతున్నారు.
బెంగళూరులో చంద్రబాబు ..
బెంగళూరులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. టీడీపీ ఫోరం ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. నాకు కష్టం వచ్చినప్పుడు అండగా ఉన్నారు.. వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఏ దేశానికి వెళ్లినా తెలుగువారు ఉంటారు.. ప్రపంచంలో నలుగురు ఐటీ ఉద్యోగులు ఉంటే అందులో ఒకరు తెలుగువారే. ఐటీ రంగంలో తెలుగు వారు పోటీ పడుతున్నారు.. అప్పుడు విజన్ 2020 అంటే కొందరు విమర్శించారు. ఆ రోజు నామాట విన్నవారు ఉన్నత స్థాయిలో ఉన్నారు. 2047లో నెంబర్ వన్ కమ్యూనిటీగా తెలుగువారుండాలని చంద్రబాబు అన్నారు.
డ్రగ్స్ పట్టివేత..
హైదరాబాద్ లో మరోసారి పోలీసులు భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి 100 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి ఈ డ్రగ్స్ తీసుకొస్తున్నారు.
బీసీలకు వైసీపీ పెద్దపీట ..
బీసీలకు వైసీపీ పెద్దపీట వేస్తుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. వంశీకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, కానీ, ఆయన ఏ కారణాలతో వెళ్లిపోయారో తెలియదన్నారు. త్వరలోనే సీఎం జగన్ విశాఖ నుంచి పరిపాలన చేస్తారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీ విజయం ఖాయమని, సంక్షేమ పథకాలే మళ్లీ జగన్ మోహన్ రెడ్డిని గెలిపిస్తాయని చెప్పారు.
జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీస్ యాక్ట్ ఉల్లంఘించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రభాకర్ రెడ్డితోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదైంది.
ఆరు గ్యారెంటీలను అమలుచేస్తాం..
ఆరు గ్యారెంటీలను అర్హులైన ప్రతిఒక్కరికి తప్పకుండా అముల చేసి తీరుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ లో ప్రజాపాలన కార్యక్రమాన్ని భట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఒక వర్గానికి, ఒక వ్యక్తికి సంబంధించిన ప్రభుత్వం మాది కాదన్నారు. మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం మాది కాదని అన్నారు. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని భట్టి చెప్పారు.
విజయ్‌కాంత్ కన్నుమూత ..
డీఎండీకే అధినేత, తమిళ సినీ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూశారు. చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయ్ కాంత్ మృతి విషయాన్ని తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది.
పొగమంచు కమ్మేసింది..
ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, యూపీలో దట్టంగా పొగమంచు అలముకుంది. సెంట్రల్ ఢిల్లీలో 50 మీటర్లకు విజిబులిటీ పడిపోయింది. విమానాలు, రైళ్లు, వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది.
సీఎం జగన్ కు లేఖ..
సీఎం జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. సమగ్ర హక్కుల పరిరక్షణ చట్టం రూపొందించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం..
తిరుమలలో ఆరోరోజు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి టీటీడీ అనుమతిస్తుంది. నిన్న (బుధవారం) శ్రీవారిని 65,361 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ. 3.91 కోట్లు .
కాకినాడలో పవన్ ..
నేటి నుంచి కాకినాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు పవన్ కాకినాడలోనే ఉంటారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలతో పవన్ చర్చిస్తారు.