చిరంజీవిపై పెట్టిన కేసులు వాపసు తీసుకున్న వారసులు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణంలో రామ్ చరణ్ నిర్మించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. అక్టోబర్ 2వ తేదీన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. ప్యాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా.. తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది. 270కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదల సమయంలో ఉయ్యాలవాడ వారసుల వివాదం తెరపైకి వచ్చింది.
ఈ క్రమంలో హైకోర్టు మెట్లెక్కిన ఉయ్యాలవాడ వారసులు.. తమకు న్యాయం చేయాలంటూ చిరంజీవిని, నిర్మాత చరణ్ ను డిమాండ్ చేశారు. అయితే లేటెస్ట్ గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన 23కుటుంబాల వారు ఒక్కొక్క కుటుంబానికి రూ.2కోట్లు చొప్పున అడిగారంటూ చిరంజీవి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయమై ఉయ్యాలవాడ వారసులు కూడా స్పందించారు.
చిరంజీవి చెప్పినట్లు అంత డబ్బులు అడగలేదని, రూ.15లక్షలను మాత్రమే ఒక్కో కుటుంబానికి అడిగామంటూ వారు వెల్లడించారు. చరణ్ కూడా అప్పుడు అందుకు ఒప్పుకున్నారని అన్నారు. ఇక సినిమాకు సంబంధించి వేసిన కేసులు అన్నింటినీ వెనక్కు తీసుకుంటామని, చిరంజీవి, రామ్ చరణ్, సురేంద్ర రెడ్డిపై వేసిన కేసులు వెనక్కి తీసుకుంటున్నట్లు వారు ప్రకటించారు.