కొండాపై యాక్షన్ లేకపోవడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ అసంతృప్తి.?
నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగి..నటి సమంత పేరు తీసుకుని విమర్శల పాలయ్యారు కొండా సురేఖ.

The film industry is unhappy with the lack of action on Konda
Gossip Garage : పాలిటిక్స్‌లో పెను సంచలనం ఆ ఇన్సిడెంట్. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని దుమారం లేపిన ఇష్యూ. తెరవెనక ఏం జరిగిందో కానీ..టీవీ స్క్రీన్ల మీదకు తెచ్చి సెన్సేషన్‌కు క్రియేట్ చేశారు తెలంగాణ మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కార్నర్ చేయబోయి.. ఏకంగా నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగి..నటి సమంత పేరు తీసుకుని విమర్శల పాలయ్యారు కొండా సురేఖ. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని కూడా డైలమాలో పడేశారు. సినీ ఇండస్ట్రీ ఓ రేంజ్‌లో రియాక్ట్ అయింది. ఏఐసీసీకి ఫిర్యాదు చేసేంత సీరియస్‌గా తీసుకున్నారు టాలీవుడ్ నటులు. నాగార్జున సతీమణి అమల అయితే ఎక్స్‌లో రాహుల్ గాంధీని ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ చిరంజీవి పాత పరిచయాలతో కొండా సురేఖ మీద ఏఐసీసీకి కంప్లైంట్ చేసినట్లు ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే ఢిల్లీ పెద్దలు కొండా వ్యవహారంపై పీసీసీని నివేదిక కూడా కోరారన్న టాక్ వినిపించింది. కానీ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాత్రం అలాంటిదేమి లేదని, ఆమె వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతోనే ఈ వివాదం ఇంతటితో ముగిసిందని కవర్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కొండా సురేఖపై కచ్చితంగా చర్యలు తీసుకుంటారని సినీ ఇండస్ట్రీతో పాటు ప్రజలు కూడా భావించారు. ఇందులో భాగంగానే ఆమెను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని..కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్ నేతలు కూడా ఇదే విషయం చెప్పారు. కొండా సురేఖ వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయని ఆఫ్‌లైన్‌లో మొత్తుకున్నారు. ఆమె మీద అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందన్నట్లుగా కూడా చెప్పుకొచ్చారు. కేంద్ర మాజీమంత్రి చిరంజీవి కొండా సురేఖపై కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న ప్రచారం నేపథ్యంలో..ఆమెపై వేటు పడుతుందని ఇటు సినిమా రంగంతో పాటు, అటు రాజకీయవర్గాలు భావించాయి. కానీ ఇప్పటివరకు అలాంటిదేమి జరగలేదు. దీంతో ఎందుకిలా జరిగిందబ్బా.. ఆఖరికి చిరంజీవి కంప్లైంట్ చేసినా..కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు లైట్ తీసుకుందని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ మొదలైందట. తమకు సంబంధం లేని రాజకీయల్లోకి లాగి ఏ మాత్రం ఆధారాలు లేని ఆరోపణలు చేసినా ఢిల్లీ పెద్దలు పట్టించుకోలేదని వాపోతున్నారట.
కొండా సురేఖపై చర్యలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో పాటు మహిళా మంత్రిపై వేటు వేస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయోనని..పార్టీకి నష్టం జరుగుతుందా అని లెక్కలు వేసుకున్నట్లు చర్చ జరుగుతోంది. అంతే కాకుండా కొండా సురేఖ అసలు ఉద్దేశం కేటీఆర్‌ను టార్గెట్ చేయడమేనని, అది కాస్త మిస్ ఫైర్ అయ్యిందని.. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ పెద్దలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారట. అయితే నాగార్జునతో పాటు, కేటీఆర్ కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడంతో కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందోనని అంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. న్యాయస్థానం కొండాకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే మాత్రం అప్పుడు కచ్చితంగా ఆమెపై వేటు పడే అవకాశం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.
ఈ వ్యవహారం ఇలా నడుస్తుండగానే మరో వివాదంలో చిక్కుకున్నారు మంత్రి కొండా సురేఖ. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కొండా సురేఖ వర్గీయుల మధ్య తలెత్తిన వివాదం హాట్ టాపిక్ అయింది. మంత్రి సురేఖ స్వయంగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన కొండా సురేఖ.. సీఐ కుర్చీలో కూర్చోవడం, పోలీసులను నిలబెట్టి వారిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం కొత్త వివాదానికి దారితీసింది. బాధ్యతాయుతమైన మంత్రి వదవిలో ఉండి.. ప్రొటోకాల్ నిబంధనల్ని ఉల్లంఘించారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ ఇష్యూపై కూడా ఇటు సొంత పార్టీ నేతల నుంచి అటు ప్రతిపక్షాల నుంచి ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇలా వరుస వివాదాలు ఎదుర్కొంటున్న మంత్రి కొండా సురేఖపై ఇప్పుడైనా ఏమైనా చర్యలు ఉండే అవకాశం ఉందన్న ప్రచారం మరోసారి తెరమీదకు వచ్చింది.