సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత..

  • Published By: sekhar ,Published On : October 12, 2020 / 02:06 PM IST
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్ కన్నుమూత..

Updated On : October 12, 2020 / 2:43 PM IST

Rajan-Nagendra: దక్షిణాది సినీ సంగీత ప్రియులను కొన్ని దశాబ్దాల పాటు అలరించిన రాజన్-నాగేంద్ర ద్వయంలో రాజన్ (87) బెంగళూరులో కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రాజన్ ఆదివారం రాత్రి బెంగళూరులోని తన నివాసంలో తుది శ్వాస విడిచినట్టు ఆయన కుమారుడు అనంత్‌కుమార్ తెలిపారు. 1952లో ‘సౌభాగ్య లక్ష్మి’ అనే కన్నడ సినిమాతో సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన రాజన్-నాగేంద్ర ద్వయం 37 సంవత్సరాల పాటు దక్షిణాది సంగీత ప్రియులను అలరించింది.


వీరిద్దరూ 200 కన్నడ చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళం, తుళు, సింహళం వంటి భాషల్లో కలిపి మరో 175 చిత్రాలకు సంగీతమందిచారు. మొత్తంగా 375 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.


తెలుగులో ‘అగ్గి పిడుగు, పూజ‌, ఇంటింటి రామాయ‌ణం, నాలుగు స్తంభాలాట‌, పంతుల‌మ్మ‌, మూడుముళ్ళు, ప్రేమ ఖైదీ, సొమ్మొకడిది సోకొక‌డిది, రెండు రెళ్ళు ఆరు, నాగ‌మ‌ల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగ‌లు, ఆడ‌ప‌డుచు, రౌడీ పోలీస్ సీత పుట్టిన దేశం, అప్పుల అప్పారావు, చూపులు క‌లిసిన శుభ‌వేళ‌, వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు’ వంటి చిత్రాలకు మధురమైన పాటలు అందించారు. రాజన్-నాగేంద్ర ద్వయంలో నాగేంద్ర (65) 2000 నవంబరులో కన్నుమూశారు. రాజన్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.