Hindu God Idols: రూ.12 కోట్ల విలువ చేసే 600 ఏళ్ల నాటి హిందూ దేవతల విగ్రహాలు స్వాధీనం
ఒక్కటి 23 కిలోల బరువు, సుమారు రెండున్నర అడుగుల ఎత్తు ఉన్నాయి. మొత్తం విగ్రహాల విలువ రూ.12 కోట్లు ఉంటుందని సీఐడీ పోలీసులు తెలిపారు

Idols
Hindu God Idols: దేశం నుంచి అక్రమ మార్గంలో తరలెళ్ళిపోయిన పురాతన విగ్రహాలను వస్తువులను తిరిగి తెప్పించేందుకు ఓ వైపు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంటే..మరోవైపు విగ్రహాల తరలింపు యదేశ్చగా కొనసాగిస్తున్నారు అక్రమార్కులు. భారతీయ సాంప్రదాయానికి, హిందువుల నమ్మకానికి ప్రతీకగా చెప్పుకునే దేవతా విగ్రహాలు ఇలా అక్రమార్కుల చేతుల్లో పడి విదేశాలకు తరలి వెళ్లిపోవడం ఆందోళన వ్యక్తం అవుతుంది. తమిళనాడు విగ్రహాల శాఖ “హుహ్”కు చెందిన కొన్ని విలువైన విగ్రహాలను ఇటీవల సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పురాతన హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాలను పుదుచ్చేరిలోని ఒక ప్రదేశంలో అక్రమంగా ఉంచారని చెన్నై పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసు బృందం పుదుచ్చేరిలోని సఫ్రాన్ రోడ్డులో ముమ్మర తనిఖీలు చేపట్టి మూడు హిందూ దేవతల పురాతన లోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
Also Read:AAP Raghav Chadha: కాంగ్రెస్ ఒక చచ్చిన గుర్రం, బీజేపీకి ప్రత్యామ్న్యాయం ఆప్: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా
విగ్రహాలను పరిశీలించిన పురాతత్వశాస్త్రవేత్తలు ఈ విగ్రహాలు 600 సంవత్సరాల నాటివిగా గుర్తించారు. చోళ మరియు విజయనగర రాజవంశ కాలానికి చెందినవిగా అధికారులు పేర్కొన్నారు. ‘స్వాధీనం చేసుకున్న మూడు విగ్రహాలు నటరాజ’, ‘వింధర శివ’, ‘విష్ణువు’లవిగా గుర్తించారు. ఈ మూడు విగ్రహాలు గతంలో పుదుచ్చేరికి చెందిన దివంగత జోసెఫ్ కొలోంబానీ ఆధీనంలో ఉండేవి. 1980కి ముందు ఈ విగ్రహాలు తమిళనాడులోని వివిధ హిందూ దేవాలయాల నుండి దొంగిలించబడ్డాయి. ఈ విగ్రహాలు ఒక్కటి 23 కిలోల బరువు, సుమారు రెండున్నర అడుగుల ఎత్తు ఉన్నాయి.
Also read:Tunisia Ship : ట్యునీషియా తీరంలో మునిగిన 750 టన్నుల డీజిల్ ట్యాంకర్ నౌక..
వీటిలో నటరాజ విగ్రహం విలువ రూ.6 కోట్లు ఉంటుందని, మిగిలిన రెండు విగ్రహాల విలువ ఒక్కొక్కటి రూ.3 కోట్లు కాగా, మొత్తం విగ్రహాల విలువ రూ.12 కోట్లు ఉంటుందని సీఐడీ పోలీసులు తెలిపారు. ఈ విగ్రహాల మూలం మరియు వాటితో సంబంధం ఉన్న దేవాలయాల గురించి పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పలువురు వ్యక్తులు ఈ విగ్రహాలను దొంగిలించి ఫ్రాన్స్ కు తీసుకెళ్లడానికి కూడా ప్రయత్నించినట్లు కేసు దర్యాప్తు సమయంలో తేలింది. కాగా గత 400 ఏళ్లుగా భారతదేశం నుంచి అక్రమ మార్గంలో విదేశాలకు చేరిన అతివిలువైన పురాతన విగ్రహాలను తిరిగి తెప్పించేందుకు విదేశాంగశాఖ తీవ్రంగా కృషి చేస్తుంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే తమ దేశానికి అక్రమ మార్గంలో వచ్చిన హిందూ దేవతా విగ్రహాలను భారత్ కు అప్పగించాయి.