షేక్ హ్యాండ్ వద్దు…నమస్తే ముద్దు : కరోనా కట్టడికి కర్ణాటకలో కొత్త క్యాంపెయిన్

  • Published By: venkaiahnaidu ,Published On : March 11, 2020 / 03:11 PM IST
షేక్ హ్యాండ్ వద్దు…నమస్తే ముద్దు : కరోనా కట్టడికి కర్ణాటకలో కొత్త క్యాంపెయిన్

Updated On : March 11, 2020 / 3:11 PM IST

కర్ణాటకలో ఇప్పటివరకు నాలుగు కరోనా(కోవిడ్-19) పాజిటివ్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కి మొదట కరోనా సోకినట్లు నిర్థారణ అవగా, ఆ తర్వాత అతని భార్య,కూతరు,అతడితో దుబాయ్ నుంచి బెంగళూరు వరకు విమానంలో ప్రయాణించిన వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. దీంతో కర్ణాటకలో మొత్తం నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొదటి కోవిడ్ -19 రోగితో సంప్రదించిన 2,666 మందిని రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇప్పుడు ట్రాక్ చేస్తోంది. టెకీ కుమార్తె యొక్క పాఠశాలతో పాటు టెకీ సమయం గడిపిన అపార్ట్మెంట్ మరియు కార్యాలయ సముదాయాలను ఆరోగ్య శాఖ అధికారులు క్లీన్ చేస్తున్నారు.

మరోవైపు భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 60కి చేరింది. ఈ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ఓ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. అదే  “నమస్తే క్యాంపెయిన్”. రాష్ట్రంలోని ప్రతి చోటా,ప్రతి ఒక్కరు షేక్ హ్యాండ్ కు బదులుగా సాంప్రదాయ భారతీయ పద్దతిలో నమస్తే చెప్పుకొని,కరోనాపై ఫైట్ చేయాలని కర్ణాటక ప్రభుత్వం ఈ క్యాంపెయిన్ ను లాంఛ్ చేసింది. అంతేకాకుండా కరోనా వైరస్ దృష్యా కర్ణాటక రాష్ట్రంలో జరగాల్సి ఉన్న అన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లను రద్దు చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రజలెవరూ నిరసనలు చేయడం వంటివి మానుకోవాలని,పెద్ద ఎత్తున గుమిగూడటం వంటి వాటికి దూరంగా ఉండాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ భాస్కర్ రావు ప్రజలను కోరారు. డ్రంక్-అండ్-డ్రైవ్ చెక్‌ల కోసం బ్రీత్ ఎనలైజర్‌లను వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఉపయోగం తర్వాత స్ట్రాలను రీప్లేస్ చేయాలని, పరికరాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడానికి అన్ని ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇవ్వబడ్డాయని ఆయన తెలిపారు. వాహనదారులు మద్యం సేవించారో లేదో తనిఖీ చేయడానికి నేరుగా శ్వాస పరీక్షలు చేయకుండా ఉండాలని వారికి చెప్పబడినట్లు ఆయన తెలిపారు.

మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కరోనా వ్యాప్తిని నివారించడమే లక్ష్యంగా తాత్కాలిక రెగ్యులేషన్ ‘కర్ణాటక ఎపిడెమిక్ డిసీజెస్, కోవిడ్ -19 రెగ్యులేషన్స్ 2020’ను జారీ చేసింది. కరోనా అనుమానిత కేసులను స్క్రీనింగ్ చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క ప్రభుత్వ,ప్రైవేట్ హాస్పిటల్ ఫ్లూ కార్నర్ లు కలిగి ఉండాలి. ఈ రెగ్యులేషన్ ప్రకారం…ఓ ఒక్క వ్యక్తి కానీ,ఇనిస్టిట్యూషన్ కానీ,ఆర్గనైజేషన్ కానీ కరోనాపై తప్పుడు ప్రచారం చేసేందుకు ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించకూడదు.

మరోవైపు కరోనా ఎఫెక్ట్ ఐపీఎల్‌పైనా పడే సూచనలు కన్పిస్తున్నాయ్. మెగా ఈవెంట్‌ను వాయిదా వేయమని కేంద్రానికి లేఖ రాసింది కర్నాటక ప్రభుత్వం. బెంగళూరులో మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో బెంగళూరులో మ్యాచులు నిర్వహించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. మరోవైపు బిసిసిఐ అధ్యక్షుడు గంగూలీ మాత్రం ఐపిఎల్ ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని ప్రకటించారు. అయితే… కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో..ఐపిఎల్ నిర్వహణపై  కొన్నిరోజుల్లో స్పష్టత రానుంది.