అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370 రద్దు చేస్తాం : అమిత్ షా

  • Published By: chvmurthy ,Published On : April 27, 2019 / 12:51 PM IST
అధికారంలోకి రాగానే ఆర్టికల్ 370 రద్దు చేస్తాం : అమిత్ షా

Updated On : April 27, 2019 / 12:51 PM IST

జార్ఖండ్:  బీజేపీ ప్రభుత్వం తిరిగి కేంద్రంలో అధికారంలోకి రాగానే కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేస్తామని  పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. జార్ఖండ్ లోని పలమావ్ జిల్లాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రతపై మేమ ఏ మాత్రం రాజీ పడమని, భారత్ నుంచి కాశ్మీర్ ను  వేరు చేసేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని , దాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. యూపీఏ ప్రభుత్వ హాయంలో దేశం ప్రతినిత్యం పాకిస్తాన్ ఉగ్రవాదులకు టార్గెట్ గా మారిందని, తీవ్రవాదుల చేతిలో జవాన్లు మరణించారని ఆయన చెప్పారు.

నరేంద్ర మోడీ ని మరో సారి ప్రధాని గా ఎన్నుకుంటే ఆర్టికల్ 370 రద్దు చేసి తీరతామని ఆయన హామీ ఇచ్చారు. జమ్మూ  కాశ్మీర్ కు  ప్రత్యేక ప్రధాని కావాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ ఒక దేశానికి ఇద్దరు  ప్రధానులు ఉంటారా ? అని ఓటర్లను అడిగారు. భారత్ నుంచి  కాశ్మీర్ ను ఎవరూ విడదీయలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.