జీపులో నుంచి జారిపడ్డ పాప.. రాత్రి రోడ్డుపై పాకుతూ

  • Published By: sreehari ,Published On : September 9, 2019 / 01:20 PM IST
జీపులో నుంచి జారిపడ్డ పాప.. రాత్రి రోడ్డుపై పాకుతూ

Updated On : September 9, 2019 / 1:20 PM IST

కేరళలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. నడిరోడ్డుపై అర్ధరాత్రి ఏడాది పాప పాకుతూ కనిపించింది. కేరళలోని మున్నార్ టౌన్ పర్యాటక ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌యూవీ జీపులో వెళ్తున్న దంపతుల కుమార్తె వాహనంలో నుంచి జారి రోడ్డుపై పడింది.

ఆ విషయం తల్లిదండ్రులు గుర్తించలేదు. వేగంగా దూసుకెళ్తున్న జీపులో నుంచి పాప కింద పడటంతో తలకు గాయలయ్యాయి. రాత్రి సమయంలో ఏడుస్తూ నడిరోడ్డుపై పాకుతూ కనిపించింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఎలాంటి వాహనాలు రాలేదు. పక్కనే అడవి కూడా ఉంది. అది చెక్ పోస్టు కావడంతో అక్కడి సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు పాపను గుర్తించారు. 

అడవి పక్కనే ఉన్న రోడ్డుపై చీకటిలో ఏదో వంగి పాకుతున్నట్టుగా కనిపించడంతో పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ఏదైనా జంతువు అయి ఉండొచ్చునని భావించారు. దగ్గరగా పరిశీలించే సరికి పసిపాపగా గుర్తించారు. పాప జీపులో నుంచి కింద పడటంతో తలకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తల్లిదండ్రులను గుర్తించి వారికి పాపను పోలీసులు అప్పగించారు.

చెక్ పోస్టు దగ్గర రోడ్డుపై పసిపాప తారాడుతూ కనిపించినట్టు ఎస్ఐ సంతోష్ కేఎంకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ ప్రాంతంలోని పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులను సంప్రదించేవరకు తమ పాప జారిపడిన విషయాన్ని గుర్తించలేదు. దేవాలయంలో పూజలు నిర్వహించిన తర్వాత తమిళనాడు సమీపంలోని తమ ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయపడిన పసిపాపకు ఒక సోదరుడు మరో సోదరి ఉంది.