ఖాళీ గ్రౌండ్ కి గవర్నర్ రిపబ్లిక్ డే స్పీచ్

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా శనివారం(జనవరి 26,2019) మిజోరాం గవర్నర్ కుమనమ్ రాజశేఖరన్ తన ప్రసంగాన్ని ఖాళీ మైదానానికి వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్‌జీవోలు) నిరసన వ్యక్తం చేశాయి. దీంతో ఈ కార్యక్రమానికి ప్రజలు హాజరు కాలేదు. కేవలం అధికారులు, మంత్రులు, శాసన సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.
జిల్లా కేంద్రాల్లో డిప్యూటీ కమిషనర్లు జాతీయ జెండాలను ఎగురవేసి, గౌరవ వందనం సమర్పించారు. గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్ర సరిహద్దులను సంరక్షించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. మిజోరా గ్రామం స్థాయి పౌరసత్వ నమోదు చర్యలు అమల్లోకి తీసుకుంటామని, మిజో గుర్తింపు, సంప్రదాయం, విలువలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.