వరుడికి వధువు షాక్ : తాళి కట్టించుకొనేందుకు నిరాకరణ

bride shocks to bridegroom : ప్రేమో.. పెళ్ళో.. లేక ఇంకేదో కానీ అదేదో ముందే చెబితే పాపం ఆ వరునికి పరువైనా దక్కేదేమో.. ఇవేవీ ఆలోచించని ఓ వధువు.. ఆఖరి నిమిషంలో షాకిచ్చిందో వరునికి. అంతా ఓకే అనుకుని.. మరో నిమిషంలో తాళి కట్టేందుకు వరుడు రెడీ అవుతుండగా.. నాకీ పెళ్ళొద్దు బాబూ అంటూ ఏకంగా తాళిని అడ్డుకుందా వధువు. దీంతో నివ్వెరపోయిన వరుడు.. ఏమీ చేయలేక అక్కడ్నించి నిష్క్రమించగా.. బంధువులంతా తలొ దిక్కు వెళ్ళిపోయారు. ఈ ఉదంతం తమిళనాడులో జరిగింది.
సరిగ్గా తాళి కట్టే సమయంలో వరుడికి షాక్ ఇచ్చిందా వధువు. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరిలో నివాసముంటున్న ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకే చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు ఇరువురి కుటుంబసభ్యులు. వివాహ వేడుకలో వరుడు తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రేమించిన వాడు అరగంటలో వస్తాడని చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు. ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చుట్టూ వున్న బంధువుల వైపు చూశాడు.
బంధువుల జోక్యం చేసుకుని సర్ది చెప్పబోతే వధువు ససేమిరా అన్నది. ఓ పెద్దావిడ మరికొంత జోక్యం చేసుకుని వధువుని నాలుగు దెబ్బలేసైనా ఒప్పిద్దామనుకుంటే.. వధువు ఆ పెద్దావిడకు ఎదురు తిరిగింది. ఈ తంతు కొనసాగుతుండగానే ఎటూ తోచని వరుడు వివాహ వేడుక నుంచి వెళ్ళిపోయాడు. కుటుంసభ్యులు ఎంతగా వారించిన ప్రియదర్శిని మాట వినలేదు. పెళ్లి ఆగిన తరువాత ఎంతసేపటికి ప్రియదర్శిని ప్రేమించిన వ్యక్తి రాకపోవడంతో వధువుని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు కుటుంబ సభ్యులు.