నెలాఖరు.. నగదు నిల్వలు చూసుకోండి : కేంద్రం సూచనలు

  • Published By: chvmurthy ,Published On : March 31, 2020 / 03:41 AM IST
నెలాఖరు.. నగదు నిల్వలు చూసుకోండి : కేంద్రం సూచనలు

Updated On : March 31, 2020 / 3:41 AM IST

ఒకటో తారీఖు  వచ్చిందంటే చాలు మధ్య తరగతి జీవుల హడావిడి అంతా ఇంతా కాదు.. కరోనావైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్నా ఒకటో తారీఖు వచ్చిందంటే వాళ్లకుండే కమిటె మెంట్స్ వాళ్లకు ఉంటాయి.

ఒకటో తారీఖు దగ్గరపడటంతో జీతాల వేళ వేతన జీవులు ఇబ్బంది పడకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. ఒక్కసారిగా విత్‌డ్రాయల్స్‌కు డిమాండ్‌ పెరిగే అవకాశం ఉండటంతో తగినంత స్థాయిలో నగదు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ రంగ బ్యాంకులకు సూచించింది. 

అలాగే వివిధ పథకాల కింద రైతులు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల ఖాతాల్లోకి బదిలీ చేసే నగదును ఆయా వర్గాలు విత్‌డ్రా చేసుకునేందుకు వీలుగా బ్యాంకుల శాఖలను తెరిచి ఉంచాలని కూడా పేర్కొంది. కరోనా వైరస్‌ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే రాబోయే రోజుల్లో వివిధ పథకాల లబ్ధిదారులు విత్‌డ్రాయల్స్‌ కోసం పెద్ద ఎత్తున బ్యాంకులకు వచ్చే అవకాశం ఉందని సీనియర్‌ బ్యాంక్‌ అధికారి ఒకరు తెలిపారు. 

దీంతో పాటు జీతాల విత్‌డ్రాయల్స్‌కు సంబంధించి ఏప్రిల్‌ 1 నుంచి 10 దాకా బ్యాంకుల్లో రద్దీ ఉంటుందని వివరించారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే డిమాండ్‌కి తగినంత స్థాయిలో శాఖలతో పాటు ఏటీఎంలలో కూడా నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాలని బ్యాంకులకు ఆర్థిక శాఖలో భాగమైన ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్‌) సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో శాఖలను కూడా తెరిచి ఉంచాలని కూడా ఆదేశించినట్లు వివరించాయి.

రాష్ట్రాలకూ లేఖలు..: బ్యాంకుల సిబ్బంది, ఆర్‌బీఐ ఉద్యోగులు, నగదు సరఫరా చేసే సంస్థల సిబ్బంది, ఏటీఎం మెయింటెనెన్స్‌ ఉద్యోగులు, నగదు వ్యాన్లు మొదలైన వాటి రాకపోకలకు ఆటంకాలు కలగకుండా చూడాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కూడా డీఎఫ్‌ఎస్‌ లేఖ రాసింది. లాక్‌డౌన్‌ పరమైన ఆంక్షల కారణంగా వీరు ఇబ్బందులు పడకుండా చూసేందుకు అధికారులు, పోలీసులకు తగు సూచనలు చేయాలని పేర్కొంది.

Also Read | కేరళలో ఒకే కుటుంబంలో ఐదుగురికి నెగటీవ్.. ఐసోలేషన్ వార్డు నుంచి డిశ్చార్జి.. చప్పట్లు కొడుతూ ఇంటికి పంపిన ఆస్పత్రి సిబ్బంది