Kumaraswamy: కాంగ్రెస్ గ్యారెంటీలపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన హస్తం పార్టీ

జనాల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తెలిసిన కాంగ్రెస్ నయవంచనను ఓటర్లంతా గుర్తించాలని.. కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ బూటకాలేనన్నారు కుమారస్వామి.

Kumaraswamy: కాంగ్రెస్ గ్యారెంటీలపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన హస్తం పార్టీ

Congress guarantees have failed in Karnataka HD Kumaraswamy

Kumaraswamy on Congress: కర్ణాటక ప్రణాళికతో త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహం రచించింది కాంగ్రెస్ పార్టీ. కానీ.. ఇప్పుడా ఐదు హామీలే ఆ పార్టీకి పెద్ద చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కర్ణాటకలో ఇచ్చిన గ్యారెంటీలు విఫలమయ్యాయని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ సీఎం, జేడీఎస్ అగ్రనేత కూడా కాంగ్రెస్ స్కీమ్స్‌పై మండిపడ్డారు. గ్యారెంటీ స్కీమ్‌లతో కర్ణాటక ప్రజల్ని మోసం చేసిన హస్తం పార్టీ.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో స్కామ్‌లు చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ గ్యారెంటీలను అస్సలు నమ్మొద్దన్నారు మాజీ సీఎం, జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5 గ్యారంటీలను ప్రకటించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఓట్ల కోసం అవే హామీలిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ గ్యారెంటీలు కర్ణాటకలో విఫలం కావడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇచ్చిన హామీలు అమలు చేయడం రాని సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. పక్క రాష్ట్రాల్లో మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు కుమారస్వామి. కర్ణాటకలో కనీసం 5 గంటలు కూడా కరెంటు ఇవ్వలేని ఈ నేతలు.. 24 గంటలు నిరంతరాయంగా కరెంటు ఇస్తున్న తెలంగాణకు వెళ్లి ప్రచారం చేయడం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారాయన. రైతులను ఇబ్బంది పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమన్న కుమారస్వామి.. కర్ణాటకలో అధికారంలోకి రాగానే రైతులకు 4 వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని రద్దు చేశారన్నారు. కానీ.. తెలంగాణలో ఓట్లు దండుకోవడానికి మాత్రం రైతులకు 15 వేల రూపాయలు ఇస్తామంటూ మాయమాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నయవంచన
గృహజ్యోతి పేరిట కాంగ్రెస్ చెబుతున్న మాటలన్నీ బూటకాలేనన్నారు జేడీఎస్ నేత కుమారస్వామి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి.. నిబంధనల పేరిట దాన్ని కుదించడమే కాకుండా.. టారిఫ్‌ను సైతం పెంచేశారని మండిపడ్డారు. ఇక నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఈ ఏడాది డిగ్రీ పూర్తయిన వారికే దాన్ని వర్తింపజేస్తామని ఇప్పుడు మాటమార్చడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు కుమారస్వామి. జనాల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకోవడమే తెలిసిన కాంగ్రెస్ నయవంచనను ఓటర్లంతా గుర్తించాలని కోరారు కుమారస్వామి. కర్ణాటకలో చేయలేని పనులను కూడా తెలంగాణలో చేస్తామని చెప్పుకోవడం కేవలం ఆ పార్టీకే చెల్లుతుందని ఎద్దేవా చేశారు కుమారస్వామి.

Also Read: స్వతంత్రులు, చిన్న పార్టీల నేతలపై ఫోకస్ పెట్టిన గులాబీ పార్టీ

ఆర్‌ఎస్‌ఎస్‌ నిక్కర్‌ లో కుమారస్వామి
తమ పార్టీపై కుమారస్వామి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్ స్పందించారు. బీజేపీతో పొత్తుపెట్టుకుని, ఆర్‌ఎస్‌ఎస్‌ నిక్కర్‌లు ధరించడం ప్రారంభించినందున.. కాంగ్రెస్‌పై కుమారస్వామి నిందలు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో జేడీఎస్‌ తమను ఓడించలేకపోయిందని గుర్తుచేశారు. కుమారస్వామి గందరగోళ ప్రకటనలు తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీజేపీ విజయానికి తోడ్పడవని అన్నారు. కర్ణాటకలో తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, కొత్త పథకాలు అయినందున ఆరంభంలో చిన్నచిన్న ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. అన్నీ ఆలోచించే తెలంగాణలో హామీలు ఇచ్చామన్నారు.

Also Read: గెలుపోటముల నిర్ణేతలుగా రెబల్స్.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్, బీజేపీ