ఇందిరాగాంధీ-2 : మోడీని ఢీ కొట్టనున్న ప్రియాంక

2019 లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి ప్రియాంకాగాంధీ డైరక్ట్ ఎంట్రీ సంచలనంగా మారింది. సొంత పార్టీలో బిగ్ డెవలప్ మెంట్ అయితే.. బీజేపీకి మాత్రం ఊహించని షాక్ అంటున్నారు. ఇప్పుటివరకు అమ్మ సోనియా, అన్న రాహుల్ నియోజకవర్గానికే పరిమితమైన ప్రియాంకాగాంధీని యూపీ తూర్పు ప్రాంతానికి జనరల్ సెక్రటరీగా నియమిస్తూ ఏఐసీసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దేశ రాజకీయాలను శాసించాలంటే ఏ పార్టీ అయినా ఉత్తరప్రదేశ్లో సత్తా చాటాల్సిందే. అలాంటి ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది. గతంలో కాంగ్రెస్కు యూపీ కంచుకోట. క్రమంగా బీఎస్పీ, ఎస్పీ పార్టీల ప్రాబల్యం పెరగడంతో కాంగ్రెస్ తన ప్రాభవాన్నికోల్పోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో 80 ఎంపీ స్థానాలున్న యూపీలో కేవలం 2 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. సోనియా, రాహుల్ గాంధీలు మాత్రమే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. అటువంటి యూపీలో ఇప్పుడు ప్రియాంకా డైరక్ట్‌గా ఎన్నికల బరిలోకి దిగుతుంటంతో ప్రత్యర్ధి పార్టీల్లో కలవరం మొదలైంది.
కాంగ్రెస్‌తో జతకట్టబోమని ఎస్పీ-బీఎస్పీలు ఇప్పటికే ప్రకటించాయి. ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఎత్తులను చిత్తు చేస్తూ కాంగ్రెస్ ప్రియాంకను రంగంలోకి దించింది. ప్రియాంకలో నాయనమ్మ ఇందిరా గాంధీ పొలికలు ఎక్కువగా ఉంటాయి. ఇందిరాలానే ప్రియాంక కూడా పేద వర్గాలను ఆకట్టుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రియాంక రాకతో యూపీలో పార్టీ మరింత బలపడుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత మోతీలాల్ వోరా తెలిపారు. ప్రియాంకలో ఇందిరాగాంధీని ప్రజలు చూస్తున్నారని యూపీ కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ తెలిపారు. బీఎస్పీ-ఎస్పీ ఎత్తులను చిత్తు చేసే వ్యూహంలో భాగంగానే ప్రియాంకను రంగంలోకి దించారనేది స్పష్టంగా తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సోనియా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చునని సమాచారం. దీంతో సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ప్రియాంకా బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం.
యూపీలో దుర్బర స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక తురుపు ముక్క కాబోతున్నది అని ఆ రాష్ట్ర పార్టీ అంటోంది. SP, BSP, BJPలను ధీటుగా ఎదుర్కోవాలంటే ఒక్క రాహుల్ గాంధీ వల్ల సాధ్యం కాదని డిసైడ్ అయిన తర్వాతే.. ప్రియాంకను రంగంలోకి దించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఎక్కువ స్థానాలు ఉన్న యూపీలో పార్టీ బలపడి.. ఎక్కువ సీట్లు గెలవాలి అంటే ప్రియాంక రాకనే కరెక్ట్ అంటున్నారు. యూపీ బాధ్యతలను ప్రియాంక చేతిలో పెట్టి.. మిగతా రాష్ట్రాల్లో రాహుల్ ప్రచారం చేసే విధంగా పార్టీ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే అవకాశాలూ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీలోనే మరో వాదన కూడా వినిపిస్తోంది. యూపీతోపాటు దేశవ్యాప్తంగా ప్రియాంకతో ప్రచారం చేయించాలనే ఆలోచన కూడా ఉంది. ఈ విధంగా చేస్తూ ఎటూ కాకుండా పోతామేమో అనే భయమూ పార్టీకి ఉంది. యూపీపైనే ప్రియాంక ఫోకస్ పెడితేనే ఫలితం ఉంటుందని లేకపోతే పార్టీ ఎదుగుదలలో మార్పు ఉండదనే యూపీ నేతలు అంటున్నారు. మొత్తానికి ఇందిరాగాంధీ 2 ఎంట్రీ అధికారికంగా జరిగిపోయింది.. తర్వాత మార్పులు అనేవి మామూలే అంటున్నారు రాజకీయ నేతలు.
దేశవ్యాప్తంగా మోడీ హవా నడుస్తోంది. బీజేపీకి బలమైన ప్రచార సారధిగా ఉన్నారు ప్రధాని. ఇలాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే రాహుల్ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అందుకే 2019 ఎన్నికల్లో రాహుల్ – ప్రియాంక జోడీ.. మోడీని ఢీకొట్టబోతోంది.