నిజాముద్దీన్ ఘటన….రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియోకాన్ఫరెన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : April 1, 2020 / 11:45 AM IST
నిజాముద్దీన్ ఘటన….రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియోకాన్ఫరెన్స్

Updated On : April 1, 2020 / 11:45 AM IST

దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎన్ని జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌దే త‌ప్ప త‌గ్గ‌డంలేదు. ఇంత‌లో మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించింది. ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లోని తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారి కారణంగా దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దేశంలోని అనేకరాష్ట్రాలతో పాటుగా విదేశాలనుంచి వచ్చినవారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గడిచిన 48గంటల్లోనే వివిధరాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 138మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది.

ఈ నేప‌థ్యంలో గురువారం(ఏప్రిల్-1,2020) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. వివిధ రాష్ట్రాల్లో న‌మోదైన క‌రోనా కేసులు, సంభ‌వించిన మ‌ర‌ణాలు, క‌రోనా నివార‌ణ‌కు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చ‌ర్య‌లు మొద‌లైన వాటిపై ఈ భేటీలో చ‌ర్చించే అవకాశం ఉంది.

ముఖ్యంగా మ‌ర్క‌జ్ నిజాముద్దీన్ స‌మావేశంలో పాల్గొన్న వారు ఏయే రాష్ట్రంలో ఎంత‌మంది ఉన్నారు? ఎంత మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది? వారిపై ప‌ర్య‌వేక్ష‌ణ ఎలా ఉంది? అనే అంశాలు కూడా ఈ భేటీలో చ‌ర్చకు రానున్నాయి. మ‌రోవైపు లాక్‌డౌన్ అమ‌లు తీరుపై కూడా ఈ భేటీలో చ‌ర్చ జ‌రుగ‌నుంది. ఈ వీడియోకాన్ఫరెన్స్ సమయంలో పలు కీలక నిర్ణయాలను మోడీ ప్రకటించే అవకాశమున్నట్లు సమాచారం.

Also Read | దేశమంతా లాక్ డౌన్…చెన్నైలో భారీ ట్రాఫిక్ జామ్