కరోనాకట్టడి: కాంగ్రెస్ పాలిత మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆధీనంలోకి ప్రైవేట్ హాస్పిటళ్లు

కరోనా వైరస్ మహమ్మారి బెడదతో వణికిపోతున్న దేశాన్ని మరో దశ చేరుకోకముందే కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. వనరులన్నింటినీ సేకరించి అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పబ్లిక్ హెల్త్ సెక్టార్ లో సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారనే మాట వాస్తవం. ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, బెడ్స్, వెంటిలేటర్లు వంటి సౌకర్యాలున్న ప్రైవేట్ హాస్పిటల్స్‌తో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో చాలా తక్కువ.
ముందస్తు జాగ్రత్తగా ప్రైవేట్ హాస్పిటళ్లన్నీ ఐసోలేషన్ వార్డును రెడీ చేసేశాయి. మార్చి 24న ఉత్తరాఖాండ్ ప్రభుత్వం ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో వంద బెడ్స్ ఉండాలని వాటిలో 25శాతం కచ్చితంగా కొవిడ్-19 పేషెంట్లకు కేటాయించాలని తీర్మానించింది. అంతకంటే ముందు కరోనా లక్షణాలతో హాస్పిటల్ కు వచ్చిన ప్రతి పేషెంట్ ను వెనక్కి పంపిస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పాలిత చత్తీస్‌ఘర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మరో అడుగు ముందుకేశాయి. ప్రైవేట్ హాస్పిటల్స్‌ను తాత్కాలికంగా తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాయి ప్రభుత్వాలు. కొవిడ్-19 పేషెంట్ల ట్రీట్‌మెంట్‌లో భాగంగా ఈ తాత్కాలిక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమయ్యాయి.
మహమ్మారి చట్టం అమలు చేస్తూ:
1897 నాటి ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ అమలు చేస్తూ రాష్ట్రాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఏదైనా ప్రమాదకరమైన జబ్బు ప్రబలిన సమయంలో ఎదుర్కొనేందుకు సమష్టిగా పోరాడాలని దాని ఉద్దేశ్యం.
నేషనల్ హెల్త్ అథారిటీ కొవిడ్-19 టెస్టులన్నింటినీ దేశవ్యాప్తంగా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీం కింద నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనిపై ఇంకా క్లియరెన్స్ రావాల్సి ఉంది. మధ్యప్రదేశ్ మాత్రం ముందుగానే ఆమోదించేసింది. ఆయుష్‌మాన్ స్కీం కింద పనిచేయని హాస్పిటళ్లలోనూ వర్తించాలని ఆదేశించింది.
సాధారణ పేషెంట్ల పరిస్థితి:
అంతా కొవిడ్-19 అయితే సాధారణ జబ్బులతో జాయిన్ అయ్యే పేషెంట్ల గురించేంటని కామన్ ప్రజలకు సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రైవేట్ హాస్పిటళ్లు కరోనా లక్షణాలున్న వ్యక్తిని చేర్పించుకోవాలంటే భయపడుతున్నాయి. ఇతరులకు సోకుతుందని భయంతో తమ హాస్పిటళ్లకు ఇతర పేషెంట్లు రారనే భ్రమతో నిరాకరిస్తున్నారు. ఈ మేర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని అవసరమైన మేరకే కరోనా పేషెంట్లకు రూంలు కేటాయించి మిగిలిన హాస్పిటల్ భాగంలో సాధారణ రోగులు ట్రీట్ చేయాలని భావిస్తున్నారు.
Also Read | కరోనా ఎఫెక్ట్ : పది వేల వెంటిలేటర్లను తయారు చేయనున్న మారుతీ సుజుకీ