కార్పోరేట్ విరాళాలు:బీజేపీ వాటా 93 శాతం

దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో గతేడాది బీజేపీ అత్యధికంగా 93 శాతం వాటా కలిగి ఉండి ప్రధమ స్ధానంలో ఉంది.

  • Published By: chvmurthy ,Published On : January 18, 2019 / 03:17 AM IST
కార్పోరేట్ విరాళాలు:బీజేపీ వాటా 93 శాతం

Updated On : January 18, 2019 / 3:17 AM IST

దేశంలో రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల్లో గతేడాది బీజేపీ అత్యధికంగా 93 శాతం వాటా కలిగి ఉండి ప్రధమ స్ధానంలో ఉంది.

ఢిల్లీ: దేశంలో గతేడాది రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో జాతీయ పార్టీలన్నింటికన్నా బీజేపీ వాటా ఎక్కువగా ఉంది.  జాతీయ పార్టీలన్నింటికీ కలిపి  మొత్తం రూ.469.89 కోట్లు రాగా,  ఒక్క బీజీపీకే రూ.437కోట్ల 4 లక్షలు వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్  రిఫార్మ్స్ తెలిపింది. మిగతా పార్టీలకు వచ్చిన మొత్తం విరాళాల విలువ కేవలం రూ.32.85కోట్లు మాత్రమే. మొత్తం విరాళాల్లో బీజేపీ వాటా 93 శాతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన విరాళాలు రూ.26.658 కోట్లు, ఎన్సీపీ కి రూ.2.087 కోట్లు, సీపీఐ.ఎం కు రూ.2.756 కోట్లు, తృణమూల్ కాంగ్రెస్ కు 20 లక్షలు  విరాళాలు అందాయి. బీఎస్పీకి రూ.20వేలకు పైగా విరాళాలు అందినట్లు ఎక్కడా రికార్డుల్లో పేర్కోలేదు. రాజకీయ పార్టీలు 20వేల రూపాయలపైగా వచ్చివ విరాళాల వివరాలు మాత్రమే ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తాయి.
బీజేపీ, కాంగ్రెస్‌కు అధిక మొత్తంలో విరాళాలు అందించిన సంస్థ ప్రూడెంట్‌ ఎలక్టోరల్‌ ట్రస్ట్‌. సంస్ధ రెండు  పార్టీలకు కలిపి రూ.164.30 కోట్లమేర  విరాళాలు ఇచ్చింది. ఇందులో బీజేపీకి రూ.154.30 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.10 కోట్లు అందించింది. బీజేపీకి అందిన మొత్తంలో ఈ సంస్థ నుంచి అందింది 35 శాతం కాగా, కాంగ్రెస్‌కు 38 శాతం. ఈ రెండు పార్టీలకు కార్పొరేట్‌ సంస్థల నుంచే అధిక మొత్తం  విరాళాలు అందాయి. గతేడాది కార్పొరేట్ల నుంచి బీజేపీకి రూ.400.23 కోట్లు, కాంగ్రెస్‌కు రూ.19.29 కోట్లు అందాయి. 
బీజేపీకి 2977మంది, కాంగ్రెస్‌కు 777మంది,సీపీఐ(ఎం)కు 196మంది, సీపీఐకి 176మంది,ఎన్‌సీపీకి 42మంది, తృణమూల్‌కు 38మంది విరాళాలు ఇచ్చారు. బీజేపీకి ఢిల్లీలోనే విరాళాలు అధికంగా రూ.208.56 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత మహారాష్ట్రలో రూ.71.93 కోట్లు, గుజరాత్‌లో రూ.44.02 కోట్లు, కర్నాటకలో రూ.43.67 కోట్లు, హర్యానాలో రూ.10.59 కోట్లు వచ్చాయి.