Cyclone Mocha : మోచా ముప్పు.. బంగాళాఖాతంలో బలపడుతున్న తుపాను
Cyclone Mocha : తుపాను ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉంది.

Cyclone Mocha
Cyclone Mocha : ఆగ్నేయ బంగాళాఖాతంలో మోచా తుపాను బలపడుతోంది. అతి ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. క్రమంగా బలపడి రాత్రికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. తర్వాత దిశను మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి రేపు(మే 12) సాయంత్రానికి మధ్య బంగాళాఖాతంలో అతితీవ్ర తుపానుగా బలపడే అవకాశముంది.
ఈ నెల 14 నాటికి క్రమంగా బలహీనపడి ఆగ్నేయ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
తుపాను ప్రభావంతో తెలంగాణలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత పొడి వాతావరణం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి గరిష్టస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తెలంగాణలో కొన్ని చోట్ల సుమారుగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదుకావచ్చని అంచనా వేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారు 37 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.