కరోనానుంచి కోలుకున్న తొలి వ్యక్తి :14 రోజుల ఒంటరితనం, కరోనాతో పోరాటం, నన్ను మార్చేసింది..

ప్రపంచమంతా కరోనా మయం. నాలుగుగోడల మధ్య ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికేస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే జీవితం ముగిసిపోయినట్లే భావిస్తున్నారు. ఇదే వాస్తవమా. దీని నుంచి బయటపడటానికి మార్గమేంటి. అనే దానిపై వైరస్ నుంచి బయటపడ్డ వ్యక్తిని ఇంగ్లీషు మీడియా ఇంటర్వ్యూ చేసింది అతని మాటల్లో….
ఢిల్లీలో కరోనా వైరస్ సోకిన మొదటి రోగి రోహిత్ దత్తానే. ప్రభుత్వం నుంచి ఒక బృందం మా ఇంటికి వచ్చింది. కొద్ది రోజుల ముందు ఎవరెవరిని కలిశానో కనుక్కొని అందరికీ పరీక్షలు చేశారు. వారందరికీ నెగెటివ్ అని రావడంతో నన్ను మాత్రమే హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించారు.
ఎప్పుడు వచ్చింది:
యూరప్ నుంచి తిరిగి రాగానే రాత్రి జ్వరంగా అనిపించింది. జ్వరం 99.5 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు పెరిగింది. విమానంలో సుదీర్ఘ ప్రయాణం చేయడం వల్ల అలసిపోవడంతో అలా అయ్యిందేమో అనుకుకున్నాను. డౌట్ క్లియర్ చేసుకోవడానికి డాక్టర్‌ను కలిశా. డాక్టర్ కొన్ని మాత్రలు ఇస్తే మూడు రోజులు వేసుకున్నా. జ్వరం తగ్గలేదు. దాంతో అనుమానం వచ్చి ఫిబ్రవరి 29న, కరోనావైరస్ నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటానని వైద్యుడికి చెప్పాను. మరుసటి రోజు చేసుకున్న పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది.
క్వారంటైన్‌లో ఎలా:
మొదటి మూడు-నాలుగు రోజులు నా పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మాటలు కూడా సరిగా రాలేదు. నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. కాబట్టి మా వాళ్లతో టచ్‌లో ఉండేవాడిని. కొంచెం జ్వరం వచ్చినట్లు అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు. బయట తిరగకూడదు. విశ్రాంతి తీసుకోవడం మంచిది. బాగా విశ్రాంతి తీసుకున్నా. కొద్ది రోజులకు ఆరోగ్యం కుదుటపడింది. ఆస్పత్రిలోనే ఫోన్‌లో సినిమాలు చూడటం, పుస్తకాలు చదవడం ప్రారంభించా.
నా మెసేజ్ ఇదే:
14 రోజుల ఒంటరితనం ఒక వ్యక్తిని మార్చేస్తుందని చెప్పగలను. అలాంటి సమయంలో ఏం తప్పు చేశానన్న దాని గురించి మనిషి ఆలోచిస్తాడు. ఆరోగ్యం బాగాలేకుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మరచిపోకండి. మీరు ఎంత త్వరగా వెళ్తే అంత త్వరగా తిరిగి ఇంటికి వస్తారు. ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు.
ఈ వైరస్ మహమ్మారితో పోరాటం ఒక యుద్ధం లాంటిదని అందరూ అర్థం చేసుకోవాలి. చైనాలో కరోనావైరస్ సోకిన వారిని గుడారాలలో ఉంచి వైద్యం చేశారు. కాబట్టి సౌకర్యాల కంటే ఆరోగ్యం ముఖ్యమని ప్రజలు గ్రహించాలి. వైద్యులకు సహకరించాలి.
భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు వెయ్యి కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఈ వ్యాధి సోకి దేశంలో ఇప్పటి వరకు 27 మంది మరణించారు. దాదాపు వంద మంది ఈ వ్యాధి నుంచి కోలుకోగలిగారు.
Also Read | దిక్కుమాలిన కరోనా : లాక్ డౌన్ తో మందుబాబుల కష్టాలు..ఎర్రగడ్డకు క్యూ