గోవింద గోవిందా : ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

  • Published By: madhu ,Published On : May 15, 2019 / 04:47 AM IST
గోవింద గోవిందా : ఢిల్లీలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Updated On : May 15, 2019 / 4:47 AM IST

తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేశ రాజధాని ఢిల్లీలోని గోల్ మార్కెట్‌లోని శ్రీ బాలాజీ మందిర్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు, వాహన సేవలతో‌ బ్రహ్మోత్సవాలు దేశ రాజధాని వాసులను కనువిందు చేయనున్నాయి. తిరుమల తిరుపతిలో ఏవిధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా శ్రీవారికి వాహన సేవలు నిర్వహించేందుకు టీటీడీ యంత్రాంగం సిద్ధమైంది.

గోల్ మార్కెట్‌లో నిర్మించిన శ్రీ బాలాజీ మందిర్‌లో ఆరేళ్లుగా టీటీడీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా పెద్ద శేషవాహనం, చిన్న శేషవాహనం, హంసవాహనం, ముత్యాల పందిరి, సింహవాహనం, కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం, సర్వభూపాల వాహనం, గరుడ వాహనం, గజవాహనం, సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనాలపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల నుంచి ఉరేగించనున్నారు.

బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం, రధోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రజలు విరివిగా పాల్గొని శ్రీనివాసుని కృపాకటాక్షములను పొందాలని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ కోరారు. ప్రతి నిత్యం అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలతోపాటు భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు.