రాహుల్‌గాంధీకి ఈసీ నోటీసులు

గిరిజనులను కాల్చి చంపడం కోసం ప్రధాని మోడీ ప్రభుత్వం కొత్త చట్టాన్ని రూపొందించిందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈసీ బుధవారం (మే1, 2019) ఈ నోటీసులు ఇస్తూ, 48 గంటల్లోగా రాహుల్ స్పదించాలని, లేని పక్షంలో రాహుల్‌ను సంప్రదించకుండానే ఈ అంశంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఏప్రిల్ 23, 2019వ తేదీన మధ్యప్రదేశ్‌లోని షాదోల్‌లో రాహుల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆ సందర్భంగా మోడీ, బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు. ‘గిరిజనులు, ఆదివాసీల కోసం మోడీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తోంది. గిరిజనులను కాల్చిపారేసేలా పోలీసులకు అనుమతి కల్పిస్తూ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై కొందరు బీజేపీ కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారుల నుంచి నివేదిక తీసుకున్న ఈసీ.. రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది.