గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2019 / 03:54 PM IST
గోవా సామాన్యుడు….మచ్చలేని రాజకీయ నాయకుడు

గోవా సీఎం మనోహర్ ఆదివారం(మార్చి-17,2019) కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రాష్ట్రపతి,ప్రధాని, ఉపరాష్ట్రపతి,కేంద్రమంత్రులు,పలు రాష్ట్రాల సీఎంలు,పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.దేశం గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయిందన్నారు.దేశం,గోవా పారికర్ ను మర్చిపోలేదన్నారు. పారికర్ మృతి తనకెంతో భాధ కలిగించిందని, ఆయనతో ఉన్న జ్ణాపకాలను మోడీ గుర్తుచేసుకున్నారు. 

ఎలాంటి సెక్యూరిటీ ఉండదు..హావాయి పాదరక్షలు…మందీమార్బలం లేకుండా ప్రయాణం…ప్రజలు ఎక్కడ ఉన్నా అక్కడ ఆగి వారి యోగక్షేమాలు విచారించడం..ఇవి గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ కన్నుమూసిన మనోహర్‌ పారికర్‌ ప్రత్యేకతలు. ఐఐటీలో ఉన్నత విద్యాభ్యాసం చేసి రాజకీయాల్లోకి వచ్చిన పారికర్‌ గోవా సామాన్యుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. చివరిశ్వాస వరకు సీఎంగా భాధ్యతలు నిర్వహించి గొప్ప నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Read Also : గోవా సీఎం పారికర్ కన్నుమూత

గోవాలో సంఘ్‌ తో పాటు క్రైస్తవ ప్రభావం ఎక్కువగా ఉంది.రెండు వర్గాలను కలుపుకోవడంలో పారికర్‌ సక్సెస్ అయ్యారు.  1994లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం అనంతరం ఇప్పటి వరకు పారికర్‌ గోవా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. గోవాలో ప్రభుత్వాలు స్థిరంగా ఉండేవికావు.  1990-2002 మధ్య కాలంలో  13 ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన పారికర్‌ ప్రజలకు అత్యంత ఇష్టమైన సీఎంగా మారారు. ముక్కుసూటితనం, నిజాయితీ, నిరాడంబరతలతో గోవా ప్రజల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు.

ఆర్ఎస్ఎస్ ప్రచారక్ నుంచి కేంద్రమంత్రి స్థాయికి ఎదిగిన పారికర్ ది దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. గోవా సీఎంగా, దేశ రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో నిజాయితీపరుడిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన రాజకీయ ప్రత్యర్థులు సైతం ప్రభుత్వ విధానాలను విమర్శించేవారేగానీ ఆయన వైఖరిని తప్పుబట్టేవారు కాదు. గోవా లాంటి చిన్న రాష్ట్రంలో సుదీర్ఘకాలం సీఎంగా బాధ్యతలు నిర్వహించి భాజపాను రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేశారు.మోడీ ఆహ్వానం మేరకు 2014లో దేశ రాజకీయాల్లోకి పారికర్ అడుగుపెట్టారు. 

ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీ కాలంలో భద్రతాదళాల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఆయుధసేకరణలో పారదర్శక విధానాలు అవలంభించారు. 2017లో జరిగిన రాష్ట్రఅసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు మెజార్టీ రాలేదు. మొత్తం 40 సీట్లలో 17 సీట్లు సాధించి అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా నిలిచింది.దీంతో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఆయన తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. ఆరోగ్యం సహకరించకపోయినా చివరి వరకు చికిత్స తీసుకుంటూ ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించారు.