భారతరత్న : సమాజ సేవకుడు నానాజీ దేశ్ ముఖ్

కేంద్రం ప్రభుత్వం నానాజీ దేశ్ ముఖ్ కు భారతరత్న ప్రకటించింది.

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 04:10 AM IST
భారతరత్న : సమాజ సేవకుడు నానాజీ దేశ్ ముఖ్

కేంద్రం ప్రభుత్వం నానాజీ దేశ్ ముఖ్ కు భారతరత్న ప్రకటించింది.

ఢిల్లీ : నానాజీ దేశ్ ముఖ్ కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది. నానాజీ దేశ్ ముఖ్ సమాజ సేవకుడిగా, రాజకీయ నాయకుడిగా సేవలందించారు. బయటి ప్రపంచానికి పేద్దగా పరిచయం లేకున్నా.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన, బలహీన వర్గాల ఉద్ధరణకు నడుంబిగించి ఆ దిశగా గణనీయమైన మార్పును తీసుకొచ్చారు. గ్రామీణ స్వరాజ్యంతోపాటు దేశవ్యాప్తంగా విద్య, వైద్య రంగాల్లో మార్పుల కోసం తీవ్రంగా శ్రమించారు. 

1916 సం.లో మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో నానాజీ దేశ్ ముఖ్ జన్మించారు. ఆయన అసలు పేరు చండికాదాస్ అమృత్ రావ్ దేశ్ ముఖ్. 12 ఏళ్ల వయసులోనే స్వయం సేవక్ గా జీవితాన్ని ప్రారంభించారు. చదువుకోవాలనే తన ఆశకు ఆర్థికపరమైన ఇబ్బందులు అడ్డంకిగా మారడంతో కూరగాయలు విక్రయించగా వచ్చే డబ్బులతో ఆయన చదువుకున్నారు. బాలా గంగాధర్ తిలక్ స్ఫూర్తిగా సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. బిర్లా కాలేజీ (నేటి బిట్స్) లో విద్యాభ్యాసం చేశారు. 

భారతీయ జన్ సంఘ్ క్రియాశీల కార్యకర్తగా మారారు. ఆ తర్వాత బీజేపీలోనూ కీలక నేతగా బాధ్యతలు నిర్వహించారు. తను ఎదుర్కొన్న సమస్యలు సమాజంలో ఎవరికీ రావొద్దని బావించి పేదలు, గ్రామీణ ప్రాంతాల వారికి విద్య, వైద్యం అందేలా తనవంతు కృషి చేశారు. దేశవ్యాప్తంగా సరస్వతీ విద్యామందిరాలను ప్రారంభించారు. మంథన్ అనే పత్రికను స్థాపించి చాలా ఏళ్లపాటు తనే సొంతంగా నిర్వహించారు. ఆయన పుట్టింది మహారాష్ట్రలోనైనా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లలోనే నానాజీ విస్తారంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్థిక, సామాజిక అసమానతలు తొలగించేందుకు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 500 గ్రామాల్లో సామాజిక పునర్నిర్మాణ కార్యక్రమాలను చేపట్టారు. 

1977లో నానాజీ లోక్ సభ ఎంపీగా గెలిచారు. 1999లో ఎన్డీయే ప్రభుత్వం ఆయన్ను రాజ్యసభకు నామినేట్ చేసింది. దేశంలోనే తొలి గ్రామీణ యూనివర్సిటీగా పేరొందిన మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ గ్రామోదయ విశ్వవిద్యాలయం నానాజీ ఆలోచనల ఫలితమే. 1974 నాటి జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమ రూపకర్తల్లో నానాజీ కూడా ఒకరు. 94 ఏళ్ల వయసులో 2010 ఫిబ్రవరిలో ఆయన కన్నుమూశారు.