శివసేనకు సవాల్: దమ్ముంటే క్యాబినెట్ నుంచి బయటకు రా

తమ పార్టీతో పొత్తుల గురించి సార్వత్రిక ఎన్నికల్లోగా నిర్ణయం తీసుకోకపోతే పాత భాగస్వాములను కూడా ఓడిస్తామంటూ శివసేనును ఉద్దేశించి ఇటీవల బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్రలో దుమారం రేపుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా మోడీ ప్రభుత్వంపై శివసేన గుర్రుగా ఉంది. రాఫెల్, జీఎస్టీ, నోట్ల రద్దు, ఈబీజీలకు రిజర్వేషన్లు వంటి అంశాల్లో మోడీ ప్రభుత్వ తీరుని శివసేన తప్పుబడుతుంది. ఈ సమయంలో అమిత్ షా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. శివసేనతో పెట్టుకొంటే బీజేపీని బొందపెడతామని శివసేన నాయకులు ఇప్పటికే బహిరంగంగా బీజేపీని హెచ్చరిస్తున్నారు.
అయితే ఇప్పుడు మహారాష్ట్ర నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జయంత్ పాటిల్ కూడా అమిత్ షా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రేకు ఓ సవాల్ విసిరారు. మీ ఒంట్లో ప్రవహించేది బాలాసాహెబ్ థాక్రే(బాల్ థాక్రే) రక్తమే అయితే దమ్ము చూపించి రేపు ఉదయానికల్లా రాష్ట్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చేయండి అంటూ ఉద్దవ్ కి పాటిల్ సవాల్ విసిరారు. ఓ పబ్లిక్ ర్యాలీలో పాటిల్ మాట్లాడుతూ.. శివసేన తరచూ బీజేపీని విమర్శిస్తూ ఉంటుందని, ఉద్దవ్ మాత్రం రెండు రోజుల క్రితం సీఎం ఫడ్నవీస్ ని సిటీలోని ఓ హోటల్ లో కళిశారని, ఇద్దరూ ఏం చర్చించుకున్నారో ప్రజలకు వివరించాలని పాటిల్ తెలిపారు.
ప్రస్తుతం దేశంలో మోడీ వేవ్ లేదని పాటిల్ తెలిపారు. దేశాన్ని, రాష్ట్రాన్ని బీజేపీ నుంచి విముక్తి కల్పించేందుకు తమ పార్టీ పరివర్తన్ యాత్రా క్యాంపెయిన్ ని లాంఛ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లించేవారికే మోడీ రిజర్వేషన్లు కల్పించారని, పేదలకు కాదని ఎన్పీసీ నేత అజిత్ పవార్ తెలిపారు.