Assembly Elections 2023: పట్టు వదలని బీజేపీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేనా?

కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు బీజేపీతో చేతులు కలపడంతో మళ్లీ కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం మారొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.

Assembly Elections 2023: పట్టు వదలని బీజేపీ.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేనా?

భారతీయ జనతా పార్టీకి బాగా పట్టున్న రాష్ట్రం మధ్యప్రదేశ్. దేశంలో ఆ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చింది కూడా అక్కడే. బూత్ స్థాయిలో బలమైన క్యాడర్ ఆ పార్టీ సొంతం. ఆ కారణంగానే దశాబ్దాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని కాషాయ పార్టీ పాలిస్తూ వస్తోంది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఆ రాష్ట్రంలో అత్యంత బలమైన నాయకుడు. మధ్యలో రెండేళ్లు తీసేస్తే గత 20 ఏళ్లుగా ఆయనే సీఎం. ఆ రాష్ట్రంలో ఒక తరం ప్రజలు శివరాజ్ కాకుండా వేరే ముఖ్యమంత్రి తెలియదు అంటే అతిశయోక్తి కాదు. అంతటి కీలకమైన రాష్ట్రంలో బీజేపీ పట్టు నిలుపుకుంటుందా అన్నది అసలు ప్రశ్న.

ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ కాషాయ పార్టీనే అధికారంలోకి రానున్నట్లు కనిపిస్తోంది. ఒకటి రెండు సర్వేలు మినహా మిగిలిన సర్వే సంస్థలన్నీ కాషాయ పార్టీకే అనుకూల ఫలితాల్ని ఇచ్చాయి. మరికొన్ని సర్వేల్లో మెజారిటీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా బీజేపీనే అవతరిస్తుందని తేల్చి చెప్పాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించింది. మెజారిటీ మార్క్ 116 కాగా ఆ పార్టీకి 114 స్థానాలు వచ్చాయి. ఇక భారతీయ జనతా పార్టీకి 109 స్థానాలు వచ్చాయి. బహుజన్ సమాజ్ పార్టీ మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ ఏడాదిన్నరకు జ్యోతిరాధిత్య సింథియా తిరుగుబాటుతో కూలిపోయింది.

అనంతరం.. కాంగ్రెస్ తిరుగుబాటు నేతలు బీజేపీతో చేతులు కలపడంతో మళ్లీ కాషాయ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఈసారి ప్రభుత్వం మారొచ్చనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి. కాషాయ పార్టీ పాలన రాష్ట్రంలో దశాబ్దాల నుంచి వస్తుండగానే కేంద్రంలో కూడా పదేళ్లు పూర్తి చేసుకోనుండడంతో.. ప్రజా వ్యతిరేకత వచ్చిందని, అది బీజేపీకి చేటు చేస్తుందనే వాదనలు వినిపించాయి. అయితే అవన్నీపటాపంచలు కానున్నట్లే తెలుస్తోంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే మధ్యప్రదేశ్ మీద కాషాయ పార్టీ తన పట్టు నిలుపుకున్నట్లే. అయితే ఎగ్జాక్ట్ (వాస్తవ) ఫలితాలు వస్తే అసలు విషయం తెలుస్తుంది.

Also Read: రాజస్థాన్‭లో మళ్లీ కీలకంగా మారనున్న బీఎస్పీ.. ఈసారి మద్దతు ఎవరికి? ఎలా ఇస్తారో అప్పుడే చెప్పేశారు