ఇండియా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జపాన్ భారీ గిఫ్ట్.. ఏంటంటే? ఇక ఏం జరుగుతుంది?
ఈ రైళ్లు 320 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తాయి.

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న వేళ టెస్ట్, ఇన్స్పెక్షన్ కోసం భారత్‌కు ఉచితంగా హై-స్పీడ్ రైళ్లను అందించాలని జపాన్ యోచిస్తోంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (MAHSR) ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే. ఇది భారత తొలి హై-స్పీడ్ రైల్ ప్రాజెక్టు.
తూర్పు జపాన్ రైల్వే హై-స్పీడ్ రైల్ టెక్నాలజీ ఈ5, ఈ3 షింకన్సెన్ రైళ్లు ఏరోడైనమిక్ డిజైన్స్ తో అధునాతన భద్రతా వ్యవస్థలతో ఉన్నాయి. కొత్త రైల్వే లైన్ ద్వారా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చా? అన్న దాన్ని చెక్ చేస్తారు. అందుకోసం ఈ5, ఈ3 రైళ్లను ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు టెస్ట్, ఇన్స్పెక్షన్ కోసం జపాన్ ఉచితంగా ఇవ్వాలని భావిస్తోంది.
భారత్ మొదట ఈ5 రైళ్లను వాడాలని అనుకుంది. ఈ రైళ్లు 320 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తాయి. అయితే, ఇప్పటికే వాటి కొనుగోళ్లలో ఆలస్యం జరగడం, ఖర్చు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ3 పాత మోడల్. భారత్ ఈ10 మోడళ్లను వాడే విషయంలోనూ చర్చలు జరుపుతోంది.
“ఇన్స్పెక్షన్ ఎక్విప్‌మెంట్‌ను అమర్చిన తర్వాత ఈ5, ఈ3 సిరీస్ నుంచి ఒక్కో రైలు 2026లో భారత్‌కు డెలివరీ అవుతుంది. ఇన్స్పెక్షన్ చేసే ఈ ట్రైన్లు అధిక ఉష్ణోగ్రతలు, ధూళి, డ్రైవింగ్ పరిస్థితులపై డేటాను సేకరిస్తాయి. భారత్‌లో భవిష్యత్తులో ఈ10 రైళ్ల ఉత్పత్తికి ఈ డేటా సాయపడుతుంది” అని జపాన్ టైమ్స్‌లో ప్రచురించిన ఓ ఆర్టికల్‌లో తెలిపారు.
సుమారు 500 కిలోమీటర్ల దూరం ఉన్న ముంబై – అహ్మదాబాద్ రూట్ మధ్య హై-స్పీడ్ రైల్ లైన్ కోసం జపాన్, భారత ప్రభుత్వాలు నెక్స్ట్ జనరేషన్ ఈ10 సిరీస్ బుల్లెట్ రైళ్లను ఉపయోగించాలని యోచిస్తున్నాయి. ఈ అధునాతన రైళ్లు 2030 – 2033 మధ్య వస్తాయి.
అయితే, ముందుగా అనుకున్నదాని ప్రకారం ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు లైన్‌ను 2027 ఆగస్టులో ప్రారంభిస్తే, ఆ సమయానికి ఈ10 సిరీస్ బుల్లెట్ రైళ్లు అందుబాటులో ఉండవు. దీంతో మొదట భారత్‌లో ఈ5, ఈ3 సిరీస్ రైళ్లను వాడే అవకాశం ఉంది.