ఎగబడుతున్న జనం: ATMలో రూ.100 డ్రా చేస్తే 500 నోట్లు!

  • Published By: sreehari ,Published On : January 11, 2020 / 04:18 PM IST
ఎగబడుతున్న జనం: ATMలో రూ.100 డ్రా చేస్తే 500 నోట్లు!

Updated On : January 11, 2020 / 4:18 PM IST

ఇక్కడి ఏటీఎంలో వందల నోట్లకు బదులుగా రూ.500 నోట్లు వచ్చి పడుతున్నాయి. అది తెలిసిన జనమంతా ఏటీఎం దగ్గరకు పరుగులు పెడుతున్నారు. ఇదేదో ఆఫర్ అన్నట్టుగా పదుల సంఖ్యలో జనమంతా ఏటీఎం ముందు క్యూ కట్టేశారు. ఈ ఒక్క ఏటీఎంలోనే ఎందుకిలా జరిగిందో అనేది తెలియక అధికారులు తలలు పట్టుకున్నారు. చివరికి ఎక్కడ సమస్య తలెత్తిందో గుర్తించి సరి చేశారు.

అప్పటికే 1.7 లక్షల రూపాయలు విత్ డ్రా అయ్యాయి. ఆ డబ్బులన్నీ విత్ డ్రా చేసుకున్న వారి నుంచి వసూలు చేసేసరికి బ్యాంకు అధికారులకు చుక్కలు కనిపించాయి. సౌత్ వెస్ట్ బెంగళూరుకు 268 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడాగు జిల్లాలోని మడికేరిలో ఓ బ్యాంకు ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. ఇది ఏటీఎం క్యాష్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ పొరబాటుగా అధికారులు గుర్తించారు. ఏటీఎంలోని వంద నోట్ల ట్రేలో రూ.500 నోట్లను తప్పుగా పెట్టడం కారణంగానే ఇలా జరిగిందని గుర్తించారు.

ఆ విషయం తెలియని కస్టమర్లు తమ అకౌంట్లో డబ్బులు విత్ డ్రా చేసుందుకు అదే ఏటీఎంకు వెళ్లడంతో ఇలా వందల నోట్ల స్థానంలో 500 నోట్లు రావడంతో పండగ చేసుకున్నారు. సంక్రాంతి ముందే వచ్చిందని పండుగ సంబరాలు చేసుకున్నారు. ఆ నోటా ఈ నోటా ఏటీఎంలో నోట్ల విషయం కాస్తా బ్యాంకు అధికారుల దృష్టికి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ ఏటీఎంను పరిశీలించి ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించే పనిలో పడ్డారు.

చివరికి అసలు సమస్య ఎక్కడిదో తెలుసుకున్నారు. ఏటీఎంలోని సీసీ కెమెరా, వారి అకౌంట్ల ఆధారంగా డబ్బులు విత్ డ్రా చేసినవారిని గుర్తించి ఎట్టకేలకు వసూలు చేశారు. కానీ, కొంతమంది విత్ డ్రా చేసిన డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించగా, పోలీసుల జోక్యంతో వారు కూడా డబ్బులను తిరిగి ఇచ్చేశారు.