పెళ్లి వాయిదా వేసుకుని విధుల్లోకి వెళ్లిన మహిళా పోలీస్ ఆఫీసర్

కరోనా కారణంగా ఎవ్వరూ కూడా బయటకు రాకూడని, రాలేని పరిస్థితి. ఇటువంటి సమయంలో కరోనా లాక్‌డౌన్ దెబ్బకు లక్షలాది పెళ్లిళ్లు, పేరంటాలు, శుభకార్యాలు కూడా ఆగిపోయాయి. ఈ క్రమంలోనే ఓ మహిళా డీఎస్పీ పెళ్లి కూడా ఆగిపోయింది. లాక్‌డౌన్ కారణంగా విధుల్లో ఉండాల్సి రావడంతో.. తన పెళ్లిని వాయిదా వేసుకున్నారు ఆమె.
కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలోని మళవళ్ళి డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.జే. పృధ్వీ పెళ్లి ఈ నెల 4వ తేదీన జరగవలసి ఉంది. ద్యామప్ప అనే యువకునితో ఏడడుగులు నడవాల్సిన సమయంలో మండ్య, మైసూరు జిల్లాల్లో కరోనా కేసులు ఉవ్వెత్తున పెరగడంతో తప్పక విధులు నిర్వర్తించాల్సిన పరిస్థితి వచ్చింది.
దీంతో ఆమె జీవితంలో ఎంతో ప్రధానమైన పెళ్లిని వాయిదా వేసుకుని యూనిఫామ్ వేసుకుని డ్యూటీ ఎక్కేశారు. పెళ్లి వాయిదా విషయాన్ని ఆమె ఎవరికీ చెప్పలేదు. అయితే సంగతి తెలిసి సహచర అధికారులు ఆమె నిబద్ధతను అభినంస్తున్నారు. ఎంపీ సుమలత అంబరీష్ ఆమెను ప్రశంసించారు.