కుమారస్వామి, సిద్ధరామయ్యలపై దేశద్రోహం కేసు

కర్ణాటక మాజీ సీఎంలు సిద్ధరామయ్య, కుమారస్వామిలపై రాజద్రోహం, పరువునష్టం కేసు నమోదైంది. దిగువ కోర్టు ఆదేశాల మేరకు బెంగళూరు పోలీస్ స్టేషన్ లో బుధవారం (నవంబర్ 28)ఈ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీ నియర్ నేతలు డీకే శివకుమార్, పరమేశ్వర, దినేష్ గుండూరావు, సీనియర్ పోలీసు అధికారుల పేర్లు కూడా దీంట్లో ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆదాయం పన్ను శాఖ దాడులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారనే కారణంతో వీరిపై ఈ కేసులు పెట్టారు. కాంగ్రెస్, జేడీఎస్ నేతలపై మల్లికార్జున అనే స్వచ్ఛంద కార్యకర్త ఇందుకు సంబంధించిన పిటిషన్ వేశారు.
జేడీ(ఎస్), కాంగ్రెస్ నేతల నివాసాలపై ఐటీ సిబ్బంది దాడులు జరపడానికి ముందే ఈ సమాచారాన్ని అప్పుడు సీఎంగా ఉన్న కుమారస్వామి లీక్ చేశారని కంప్లైంట్ లో తెలిపారు. మార్చి 27న క్వీన్స్ రోడ్ లోని ఐటీ ఆఫీస్ ముందు డిప్యూటీ సీఎం పరమేశ్వర, మాజీ సీఎం సిద్ధరామయ్య, సంకీర్ణ కూటమిలో ఉన్న మంత్రులు, అప్పటి అధికార పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు కుమారస్వామి ఈ నిరసనల్లో పాల్గొన్నారని..ఎన్నికల నియమాలను ఉల్లంఘించినట్లేననీ పిటిషనర్ తన కంప్లైంట్ లో తెలిపారు. ఐటీ అధికారులు బీజేపీ ఏజెంట్లు అంటూ సదరు నేతలు నినాదాలు చేశారని ఇది ఎన్నికల అధికారులకు ఆటంకం కలిగించినట్లేననీ ఫిర్యాదులో తెలిపారు.
రాజకీయంగానే పోరాడుతా : కాంగ్రెస్ నేత డీకే
రాజకీయంగా వేధించడం కోసమే బిజెపి నేతలు తమపై కేసులు బనాయిస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్ చెప్పారు. దీనిని తాము రాజకీయంగానే ఎదుర్కొంటామని ఆయన అన్నారు. తాము జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. కాగా..డిసెంబర్ 5న 15 అసెంబ్లీ స్ధానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలను మానసికంగా దెబ్బతీయటానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేసులు పెట్టించిందని మరోవైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.