ఆగని ఆందోళనలు…కార్లను రోడ్లపైనే వదిలేసిన ఢిల్లీ వాసులు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలతో పాటుగా ఢిల్లీ,ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా హింసాత్మక ఆందోళనలు జరుగతున్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో నిరసనలు ఉధృతమైన నేపథ్యంలో పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. దేశ రాజధానికి వచ్చే వాహనాల్లో తనిఖీలు చేశారు. అయితే, గురుగ్రామ్ నుంచి వచ్చే వాహనాలను చెక్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గురువారం ఉదయం 8 గంటలకు మొదలైన ఈ తనిఖీలతో వాహనదారులతో పాటు పాదాచారులకు కూడా అసౌకర్యం కలిగింది. తనిఖీలపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ కష్టాలు భరించలేక కొందరు తమ కార్లను రోడ్డుపైనే వదిలేసి కాలినడకన ఇళ్లకు చేరారు. గురుగ్రామ్-ఢిల్లీ హైవేపై ట్రాఫిక్ జామ్ సాధారణమే. కానీ, ఇంత ట్రాఫిక్‌ను ఎప్పుడూ చూడలేదు’అని గురుగ్రామ్ వాసి ఒకరు వాపోయారు. ఉదయం పూట భారీ వాహనాలను గురుగ్రామ్-ఢిల్లీ హైవేపైకి అనుమతించడమే భారీ ట్రాఫిక్‌కి మరో కారణమని ఆయన తెలిపారు.
ఇదిలాఉండగా.. జామియా యూనివర్సిటీ విద్యార్థులకు మద్దతునిచ్చేందుకు మేవాత్ నుంచి కొంతమంది సమూహం వస్తున్నట్టు పక్కా సమాచారం ఉండటంతో శాంతి భద్రతల దృష్ట్యా వాహన తనిఖీలు చేపట్టినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఢిల్లీ-గురుగ్రామ్ దారిని తాత్కాలికంగా మూసేసినట్లు పోలీసులు తెలిపారు.