OBC Bill : ఓబీసీ బిల్లుకి లోక్ సభ ఆమోదం..ఇకపై కులాల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రాలకే

ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలే లభించేలా కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకి ఇవాళ లోక్ సభ ఆమోదం తెలిపింది.

OBC Bill : ఓబీసీ బిల్లుకి లోక్ సభ ఆమోదం..ఇకపై కులాల జాబితా తయారు చేసే అధికారం రాష్ట్రాలకే

Loksabha

Updated On : August 10, 2021 / 8:54 PM IST

OBC Bill ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలకే లభించేలా కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకి ఇవాళ లోక్ సభ ఆమోదం తెలిపింది. ఓబీసీ కోటాకు సంబంధించి ప్రవేశపెట్టిన రాజ్యాంగ 127వ సవరణ బిల్లు 2021ను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి వీరేంద్ర కుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. విపక్షాల మద్దతుతో లోక్ సభ ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించింది.

బిల్లుతో ప్రయోజనం

1993 నుండి కేంద్రం, రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాలు రెండూ ఓబీసీల ప్రత్యేక జాబితాలను తయారు చేస్తున్నాయి. అయితే, 2018 రాజ్యాంగ సవరణ తర్వాత ఇది జరగలేదు. ఇప్పుడు ఈ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో పాత విధానం మళ్లీ అమలు చేస్తారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రం ప్రకారం వివిధ కులాలను ఓబీసీ (OBC) కోటాలో చేర్చగలుగుతాయి. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కుతుంది. ఇది హర్యానాలో జాట్‌లు, రాజస్థాన్‌లోని గుజ్జర్‌లు, మహారాష్ట్రలోని మరాఠాలు, గుజరాత్‌లో పటేళ్లు, కర్ణాటకలోని లింగాయత్‌లకు మార్గం సుగమం చేస్తుంది. ఈ కులాలు చాలా కాలంగా రిజర్వేషన్ కోసం డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఇందిరా సాహ్నీ కేసును ఉదహరిస్తూ సుప్రీం కోర్టు వారి డిమాండ్లపై స్టే విధించింది. ఇందిరా సాహ్నీ కేసు నిర్ణయం ప్రకారం, ఎవరైనా 50%పరిమితికి మించి రిజర్వేషన్ ఇస్తే, సుప్రీం కోర్టు దానిని నిషేధించవచ్చు. ఈ కారణంగా అనేక రాష్ట్రాలు ఈ పరిమితిని కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.

వ్యూహాత్మకంగానే

అయితే మరికొద్ది నెలల్లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓబీసీల మద్దతు సంపాదించుకోవడం కోసమే బీజేపీ వ్యూహాత్మకంగా ఈ బిల్లును తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఈ బిల్లు ద్వారా..హర్యానా, గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాలలోని బీజేపీ ప్రభుత్వాలు జాట్, పటేల్, లింగాయత్ కులాలను కూడా ఓబీసిలో చేర్చడం ద్వారా ఎన్నికల ప్రయోజనాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.