తండ్రిని చూడలేదు.. తగిన శాస్తి జరిగింది: రూ.కోట్ల ఆస్తి పోగొట్టుకున్న కూతురు

  • Published By: vamsi ,Published On : October 26, 2019 / 05:49 AM IST
తండ్రిని చూడలేదు.. తగిన శాస్తి జరిగింది: రూ.కోట్ల ఆస్తి పోగొట్టుకున్న కూతురు

Updated On : October 26, 2019 / 5:49 AM IST

తల్లి తండ్రులను చూడకుండా వారి ఆస్తిని మాత్రం అనుభవించాలి అనుకునే వారికి బుద్ధి వచ్చేలా చేశారు అధికారులు. వివరాల్లోకి వెళ్తే.. మదురై జిల్లా తిరుమంగలం సమీపంలోని కరడిక్కల్‌ గ్రామానికి చెందిన వైరవన్‌(80)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కొడుకులు ఇప్పటికే చనిపోగా కుమార్తె ఓ కళాశాలలో ఆచార్యురాలుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె వద్దే వైరవన్‌ ఉంటుండగా.. కొన్నాళ్లపాటు బాగోగులు చూసుకోవడంతో తన పేరిట ఉన్న రూ.3.80 కోట్ల విలువైన 6.37 ఎకరాల భూమిని వైరవన్‌ ఆమెకు రాసిచ్చేశారు. ఆస్తి రాపించుకున్న తర్వాత ఆమె అసలు ప్రవర్తన బయటపడింది.

ఆస్తి చేజిక్కడంతో ఆయనను సరిగ్గా చూసుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన వైరవన్‌ తనకున్న కొద్దిపాటి స్థలంలో చిన్న ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. దీనిపైన కుమార్తె ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఇంటిని కూల్చివేయించింది. నిస్సహాయ స్థితిలో ఉన్న తండ్రి తిరుమంగలం ఆర్డీవో మురుగేశన్‌ను కలిసి తన బాధను వెల్లడించాడు. దీంతో విచారణ జరిపించిన అనంతరం అధికారులు రాజీ కుదిర్చేందుకు యత్నించినా కదరకపోవడంతో 2007లో వచ్చిన సీనియర్ సిటిజన్స్ చట్టం సెక్షన్ 23(1) ప్రకారం భూమిని తిరిగి ఆమెకు అప్పగించారు.

ఈ చట్టం ప్రకారం ఒక సీనియర్ సిటిజన్ బహుమతిగా కూతురికి కానీ కొడుకు కానీ ఆస్తి బదిలీ చేస్తే, అతని ప్రాథమిక సౌకర్యాలు మరియు ప్రాథమిక శారీరక అవసరాలను బదిలీ చేయించుకున్నవాళ్లు చూసుకోవాలనే షరతుతో బదిలీ చేస్తారు. బదిలీ చేయించుకున్న వ్యక్తి షరతులను నెరవేర్చకుంటే తిరిగి మళ్లీ బదిలీ చేసిన వ్యక్తికే ఆస్తి అప్పగిస్తారు. దీని ప్రకారమే చట్ట ప్రకారం కుమార్తె పేరిట ఉన్న ఆస్తిని స్వాధీనం చేసుకుని, తిరిగి వైరవన్‌కు అప్పగించారు.