మోడీ సర్కార్ చేతకానితనం వల్లే ఆర్థికమాంద్యం: కక్షపూరిత రాజకీయాలు మాని ఎకానమీపై దృష్టిపెట్టండి

  • Published By: venkaiahnaidu ,Published On : September 1, 2019 / 12:45 PM IST
మోడీ సర్కార్ చేతకానితనం వల్లే ఆర్థికమాంద్యం: కక్షపూరిత రాజకీయాలు మాని ఎకానమీపై దృష్టిపెట్టండి

Updated On : September 1, 2019 / 12:45 PM IST

 ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌ ను ఆర్థిక మాంద్యం ముంచేస్తోందన్నారు. కక్షపూరిత రాజకీయాలు పక్కనబెట్టి…ఈ సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి  వివేకవంతులైన అందరి సలహాలు తీసుకోవాలని మోడీ సర్కార్ ను తాను కోరుతున్నానని మన్మోహన్ అన్నారు.  మోడీ సర్కార్ చేతకానితనం వల్లే దేశంలో ఆర్థికమాంద్యం ఏర్పడిందన్నారు.

మానవ తప్పిదాలైన పెద్దనోట్ల రద్దు, హడావుడిగా జీఎస్టీ అమలు నుంచి మన ఆర్థికవ్యవస్థ కోలుకోలేదని ఆయన అన్నారు. అంతర్జాతీయ అవకాశాల్ని కేంద్రం అందిపుచ్చుకోవడం లేదని మన్మోహన్ అన్నారు. భారత్‌ ఆర్థికంగా వృద్ధి చెందే అవకాశాలున్నా కూడా సరైన ప్రభుత్వ పాలన లేక దేశం కష్టాల్లోకి వెళ్లిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు. రైతులు, నిర్మాణరంగంలో కూలీలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్ర  ప్రభుత్వం ఎగుమతుల్ని ప్రోత్సహించడం లేదన్నారు.  ఆటోమొబైల్‌ రంగంలో 3.5లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని మన్మోహన్ అన్నారు.