మోడీ కీలక వ్యాఖ్యలు : మళ్లీ నేనే ప్రధాని

రాబోయే ఎన్నికల్లో మరోసారి ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి తాను ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడతానని అన్నారు.
ఆదివారం(ఫిబ్రవరి-3,2019) జమ్మూ కాశ్మీర్ లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా లేహ్ లో మోడీ మాట్లాడుతూ.. నా చేతుల మీదుగా ఈరోజు కొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కూడా ప్రజల ఆశీస్సులతో మళ్లీ తానే చేస్తానని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిందని, అటువంటి సంస్కృతికి బీజేపీ చరమగీతం పాడిందన్నారు.
పనులను సాగదీయడం, వాటిని తప్పుదారి పట్టించడం అన్నది లేకుండా తమ పని తీరు ఉంటుందన్నారు. ఈ సంస్కృతికి తమ ప్రభుత్వం చరమగీతం పాడిందన్నారు. లక్ష్యసిద్ధి లేని సంస్కృతిని, విభజన రాజకీయాలను ఈ అయిదేళ్ల కాలంలో దేశం నుంచి తరిమికొట్టామని మోడీ అన్నారు. లేహ్-లడఖ్ ను రోడ్డు, విమాన మార్గాలతో అనుసంధానించే రెండు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ మార్గాన్ని తొలిసారిగా రైల్వే మ్యాప్ తో జోడించే రైల్వే లైన్, కొత్త విమాన టర్నినల్ రెండు ఇక్కడ అభివృద్ధికి కొత్త రూపు ఇస్తాయని అన్నారు.
బిలాస్ పూర్-మనాలీ-లేహ్ రైల్వే లైన్ కనుక పూర్తి అయితే ఢిల్లీ-లేహ్ ల మధ్య దూరం తగ్గుతుందన్నారు. పర్యాటరంగ అభివృద్ధికి కూడా ఇది బెన్ ఫిట్ అవుతుందన్నారు. ప్రొటెక్టడ్ ఏరియా పర్మిట్ వ్యాలిడిటీ 15రోజులకు పెంచడం జరిగిందని, ఇకపై పర్యాటకులు లేహ్ కి తమ జర్నీని ఎంజాయ్ చేయగల్గుతారని అన్నారు.
అందరితో కలిసి అందరికీ అభివృద్ధి తమ నినాదమని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులకు బడ్జెట్ లో ప్రకటించిన సాయాన్ని వేగంగా అందజేసే ప్రక్రియ చేపట్టామని తెలిపారు. వీలైనంత త్వరలో మొదటివిడతలో భాగంగా రైతుల అకౌంట్లలో రూ.2వేలు జమ అవుతాయని అన్నారు.