బాంద్రాలో వలస కూలీలను రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్టు

పకడ్బందిగా లాక్ డౌన్ అమలవుతున్నా…ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు అంతమంది వలస కూలీలు ఎలా వచ్చారు ? అనే విషయంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. వీరిని రెచ్చగొట్టారని అర్థమైంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే…
2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ముగిసింది. అదే రోజు ఉదయం దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. 2020, మే 03వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది సేపటికే..ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ కు వేలాది మంది వలస కూలీలు చేరుకున్నారు.
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి..సోషల్ డిస్టెన్స్ పాటించకుండా..అందరూ ఒకే దగ్గర గుమికూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తమ సొంత గ్రామాలకు వెళ్లిపోతామని ఖరాఖండిగా చెప్పారు. నచ్చచెప్పిన వినిపించుకోలేకపోవడంతో లాఠీలకు చెబుతున్నారు.
తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ‘ఉత్తర్ భారతీయ్ మహా పంచాయత్ ‘ అనే ఎన్జీఓ ను నిర్వహిస్తున్న వినయ్ దూబే అని తేల్చారు. ఇతను వలస కూలీలను రెచ్చగొట్టారని నిర్ధారించారు. లాక్ డౌన్ పొడిగించారని, సొంత గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేశారు.
యూపీ, బీహార్, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలకు మహారాష్ట్ర ప్రభుత్వం రైళ్లను సిద్ధం చేసిందని చెప్పాడు. ఇతని పిలుపు..ఒక్కసారిగా ప్రచారం జరిగిపోయిందని, దీంతో వలస కూలీలు బాంద్రా రైల్వే స్టేషన్ చేరుకున్నారని తెలిసింది. చివరకు దూబేను అరెస్టు చేశారు.