మహా పాలిటిక్స్ : సోనియాతో భేటీ తర్వాత పవార్ ఏమన్నారంటే

మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ ఇవాళ(నవంబర్-4,2019)ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియాతో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రలో ప్రస్తుత పరిస్థితిని సోనియాకు వివరించానని.,అయితే ప్రభుత్వ ఏర్పాటు గురించి తాము చర్చించలేదని పవార్ తెలిపారు. ప్రజలు తమకు ప్రతిపక్షంలో ఉండాలని తీర్పు ఇచ్చారని పవార్ అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో తాము మాట్లాడటం కానీ,శివసేన తమతో మాట్లాడటం కానీ జరగలేదన్నారు.
గత నెల 24న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమికి పూర్తి మెజార్టీ వచ్చినప్పటికీ ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. చెరో రెండున్నసంవత్సరాల పాటు సీఎం సీటుని పంచుకోవాలంటూ 50:50 ఫార్ములాకు శివసేన పట్టుబడుతోంది. అయితే బీజేపీ అందుకు ఒప్పుకోవడం లేదు. బీజేపీ తమ డిమాండ్ లకు ఒప్పుకోకుంటే ఎన్సీపీ తమకు మద్దతిచ్చేందుకు రెడీగా ఉందంటూ శివసేన బీజేపీని పరోక్షంగా హెచ్చరిస్తోంది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ కాలం నవంబర్-8,2019తో ముగుస్తుంది. అప్పటిలోగా కొత్త ప్రభుత్వం కొలువుదీరకుంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశముందని బీజేపీ నాయకులు చెబుతున్నారు.