Nivar Cyclone : నాలుగు రాష్ట్రాలపై ప్రభావం, ఆ రాష్ట్రంలో సెలవు దినం

Nivar Cyclone : నివర్ తుఫాన్ దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫాన్‌గా మారింది. ఇది 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం ఉదయం వరకు తీవ్ర తుఫాన్‌గా మారనుంది. సాయంత్రం పుదుచ్చేరిలోని కరైకల్, చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తీరాన్ని దాటనుంది. తీరాన్ని దాటే సమయంలో 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు ఎవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. నివర్ ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉంటుందని తెలిపింది.
రాష్ట్రాలు అప్రమత్తం :
నివర్ ముప్పు పొంచి ఉండడంతో ఆయా రాష్ర్టాలు అప్రమత్తమయ్యాయి. 22 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. తమిళనాడు, పుదుచ్చేరిలో హైఅలర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పళనిస్వామి, నారాయణస్వామితో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. తమిళనాడు ప్రభుత్వం బుధవారం సెలవుదినంగా ప్రకటించింది. రవాణా సేవలను నిలిపివేసింది. పలు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. తమిళనాడులో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ దళాలు, ఆర్మీ రంగంలోకి దిగాయి. ఏడు జిల్లాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. గజ ఈతగాళ్లను సిద్ధం చేశారు.
https://10tv.in/today-tomorrow-rains-in-telangana/
లోతట్టు ప్రాంతాల ప్రజలు :
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెంబరబాక్కంతోపాటు చెన్నై దాహార్తిని తీర్చే జలశయాలన్నీ ప్రస్తుతం నిండుకుండలను తలపిస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. కరైకల్ నుంచి 30 పడవల్లో సముద్రంలో వేటకి వెళ్లిన మత్స్యకారుల జాడ తెలియడంలేదు. మరోవైపు పుదుచ్చేరిలో దుకాణాలను గురువారం వరకు మూసివేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది.
ఏపీపై ప్రభావం :
నివార్ ప్రభావం ఏపీలో ఎక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. సైక్లోన్ ప్రభావంతో రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నెల్లూరు, కడప, ప్రకాశం, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ‘నివర్’ తుపాను నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లాల అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుపాను నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. పంటలు దెబ్బ తినకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని, ఆర్బీకేల ద్వారా రైతులకు సూచనలు పంపాలని చెప్పారు. కోత కోసిన పంటలను రక్షించుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు.
తెలంగాణలో :
నివర్ తుఫాన్ ప్రభావంతో బుధవారం నుంచి తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. గురువారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురియవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ తెలంగాణలో రేపు భారీ వర్షం కురిసే అవకాశముంది. హైదరాబాద్‌లో బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే చాన్స్ ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 30 నాటికి దక్షిణ అండమాన్‌లో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది వాయుగుండంగా మారి తుపాన్‌గా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 2న నాగపట్టణం సమీపంలో తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం అంచనావేస్తోంది.