ప్రైవేటీకరించం.. ఔట్ సోర్సింగే

రైల్వేలను ప్రైవేటీకరించే ఆలోచన కేంద్రానికి లేదని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రయాణికులకు మెరుగైన సేవల్ని అందించడం కోసం ప్రైవేటు వ్యక్తులకు ఔట్‌సోర్సింగ్‌కు ఇస్తున్నట్టుగా ఆయన రాజ్యసభలో చెప్పారు. ప్రైవేటు వ్యక్తులకు రైళ్లను నడిపే బాధ్యతలు అప్పగిస్తాం కానీ.. వాటి భద్రతపై కేంద్రానిదే బాధ్యతని స్పష్టం చేశారు. లక్నో–ఢిల్లీ మధ్య నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి రైల్వే ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ వ్యవస్థ ఐఆర్‌సీటీసీ, దానికి అనుబంధంగా ఉన్న టూరిజం, కేటరింగ్ వంటివన్నీ ప్రైవేటు వ్యక్తులకు ప్రయోగాత్మకంగా అప్పగించిన విషయాన్ని పీయూష్ గోయల్ గుర్తు చేశారు.
ఇటీవల నీతి ఆయోగ్ ఆదేశాల మేరకు ప్రభుత్వం 150 రైళ్లు, 50 రైల్వే స్టేషన్లను నడపడానికి పరిమిత కాలానికి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధమైంది. రైల్వే వ్యవస్థను సజావుగా నడపాలంటే వచ్చే 12 ఏళ్లలో రూ. 50 లక్షల కోట్లు అవసరం ఉంటుందని, అంత బడ్జెట్ కేటాయించడానికి పరిమితులుంటాయని గోయల్ తెలిపారు.
ప్రయాణికులకు అత్యంత ఆధునిక సౌకర్యాలు కల్పించడమే కేంద్రం లక్ష్యమని….కానీ రైల్వేల భద్రత అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని వివరించారు. రైలు ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతోందని వారందరికీ సదుపాయాలు కల్పించాలంటే కొత్త రైళ్లు నడపాలని, లైన్లు వేయా లని, ఇదంతా కేంద్ర ప్రభుత్వానికి శక్తికి మించిన భారమని గోయల్ అన్నారు. రైల్వే వ్యవస్థలో ప్రైవేటు వ్యక్తులెవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఆహ్వానిస్తామని మంత్రి తెలిపారు.