పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరాతి ఘోరం.. కోచింగ్ క్లాస్‌కు వెళ్తున్న బాలికపై దారుణాతి దారుణం
ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు పొలంలో ఆమె విగతజీవిగా కనపడింది.

ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరవకముందే పశ్చిమ బెంగాల్‌లో మరో ఘోరం చోటుచేసుకుంది. కోచింగ్ క్లాస్‌కు వెళ్తున్న బాలికపై దారుణానికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రోజులాగే తాజాగా కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు ఇంటి నుంచి వెళ్లిన బాలికను కిడ్నాప్ చేసి హత్య చేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగి పోలీసు క్యాంపును ధ్వంసం చేసి తగులబెట్టారు. ఆ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారని బీజేపీ అంటోంది.
ఆ బాలిక మృతదేహ పోస్టుమార్టం రిపోర్టు అందాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆ బాలిక మైనర్ అని, ఆమె శుక్రవారం మహిషామరిలోని సౌత్ 24 పరగణాల్లో కోచింగ్ క్లాస్‌కు హాజరయ్యేందుకు వెళ్లి, రాత్రికి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు పొలంలో ఆమె గాయాలతో విగతజీవిగా కనిపించింది. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. తమకు ఫిర్యాదు అందగానే దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో నిందితుడు మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.