కచ్ లో మోడీ… రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్

కచ్ లో మోడీ… రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ విపక్షాలపై ఫైర్

Updated On : December 15, 2020 / 5:08 PM IST

Oppn misleading farmers గుజరాత్​ సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారం(డిసెంబర్-15,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన వాటిలో… కచ్​ లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్కు, ఆటోమేటెడ్ మిల్క్ ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్, లవణ నిర్మూలణ ప్లాంట్ ఉన్నాయి. ఆర్థికవ్యవస్థలో నూతన శకం మొదలైందని ప్రధాని పేర్కొన్నారు.

కచ్ ​పై ప్రధాని ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో కచ్​ ఒకటని కొనియాడారు. అభివృద్ధి ప్రాజెక్టులతో నూతన సాంకేతిక యుగంవైపు కచ్​ అడుగులు వేసిందన్నారు. కనెక్టివిటీ రోజురోజుకు పెరుగుతోందన్నారు. కచ్​ ప్రజలు నిరాశను కూడా అవకాశంగా మార్చుకుని పైగి ఎదిగారన్నారు. భారీ భూకంపం కూడా కచ్​వాసులను ఏమీ చేయలేకపోయిందన్నారు.

రైతు ప్రతినిధులతో ప్రధాని సమావేశమయ్యారు. రైతులకు లబ్ధి చేకూరే విధంగా గుజరాత్​ ప్రభుత్వం..గత 20ఏళ్లుగా పథకాలు రూపొందిస్తోందని ప్రధాని తెలిపారు. గుజరాత్‌లో వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి సాధించిందని, భారత జీడీపీకి పశుసంవర్ధకం 25 శాతం తోడ్పడుతుందని, ఇది పప్పుధాన్యాల సహకారం కంటే ఎక్కువని మోడీ తెలిపారు. సౌర విద్యుత్​ సామర్థ్యతను పెంపొందించుకునేందుకు తొలినాళ్ల నుంచి గుజరాత్​ కృషి చేసిందన్నారు.

రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ పునరుద్ఘాటించారు. అన్నదాతల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తుందని పేర్కొన్నారు. గుజరాత్ రైతు స్వేచ్ఛా మార్కెట్‌ను ఒకవైపు రైతులు సద్వినియోగం చేసుకుంటుండగా.. దేశంలోని ఇతర రాష్ట్రాల రైతులు కూడా ఈ వ్యవస్థను పొందాలని కోరుకుంటున్నారన్నారు. రైతుల ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం 24 గంటలు సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను ఎన్నో ఏళ్లుగా రైతులు,విపక్షాలు కూడా కోరుకుంటున్నాయని తెలిపారు. రైతుల సందేహాలను తీర్చేందుకు కేంద్రం చర్చలకు సిద్ధంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా విపక్షాలపై మోడీ ఫైర్ అయ్యారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనపై మాట్లాడిన మోడీ..ఢిల్లీ సరిహద్దులో ఆందోళనకు దిగిన రైతులు అయోమయంలో పడ్డారని, వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు కొత్త చట్టాలను తీసుకువస్తే విపక్షాలు పనిగట్టుకుని రైతులను తప్పదోవ తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు.

ఇప్పుడు రైతులను తప్పుదోవ పట్టిస్తున్న నేతలే.. తమ హయాంలో ఇలాంటి చట్టాలు రావాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు దేశం ఓ చారిత్రక నిర్ణయం తీసుకుంటే మాత్రం వీరు వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాలు రైతుల భుజాల పైనుంచి ప్రభుత్వానికి తుపాకీ గురిపెట్టాయని, అయితే దేశంలోని అవగాహన ఉన్న రైతులు వారికి సమాధానం ఇస్తారన్నారు.